ఈ చిత్రహింసలు భరించలేనమ్మా…ఇద్దరు పిల్లలతో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్: ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతికి భర్తతోపాటు ఆడపడచు, అత్తామామలు చిత్రహింసలకు గురిచేశారు. మార్పు రాకపోతుందా అని వేచిన ఆ మహిళకు ఎలాంటి ఆశ కనిపించలేదు. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన బోయినపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

ఈ ఘటనలో గృహిణి స్రవంతిరెడ్డి (30), ఆమె ఇద్దరు పిల్లలు హర్షితరెడ్డి(3) సమీక్షితరెడ్డి (2) మరణించారు. ఆత్మహత్య చేసుకునేముందు తన తల్లికి అత్తింటివారి చిత్రహింసల గురించి వాట్సప్ మెసేజ్ చేసింది. అల్వాల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి ప్రాంతానికి చెందిన సుజాత, వెంకటరెడ్డి దంపతుల కుమార్తె స్రవంతి రెడ్డి ఉన్నత విద్య పూర్తిచేసింది.

2011లో పెద్దల సమక్షంలో నల్గొండ జిల్లా ఆలేరుకు చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి (34)తో ఆమె వివాహం జరిగింది. కూతురు కాపురం సజావుగా సాగాలనే ఉద్దేశంతో వెంకటరెడ్ది దంపతులు పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లి లాంఛనాల కింద కిలో బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు, రూ.10లక్షల నగదు, రెండెకరాల పొలాన్ని ఇచ్చారు.

ఓ ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో వెంకటేశ్వర్‌రెడ్డి కీలక హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అల్వాల్‌ వెస్ట్‌ వెంకటాపురంలో కాపురం పెట్టారు. సజావుగా సాగుతున్న సంసారంలో కొన్నాళ్లకే కలతలు మొదలయ్యాయి. భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధింపులు భరించలేని స్థాయికి చేరుకున్నాయి.

కట్నంగా తీసుకువచ్చిన రెండెకరాల భూమిని తన పేరిట రిజిస్ట్రే‌షన్‌ చేయించాలంటూ కొన్నాళ్లుగా స్రవంతిపై భర్త వెంకటేశ్వర్‌ రెడ్డి ఒత్తిడి తెచ్చాడు. అతనికి అత్త శారద, మామ దేవేందర్‌రెడ్డి, ఆడపడుచు వేద, ఆమె భర్త రమేశ్‌ తోడయ్యారు. అందరూ కలిసి స్రవంతిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో తీవ్ర కలత చెందిన స్రవంతి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. బలవన్మరణానికి ముందు తల్లికి వాట్సప్‌ మెసేజ్‌ పంపింది.

ఆ మెసేజ్ ఇలా ఉంది.. ‘అత్తింటికి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ నరకమే చూశా. పిల్లల కోసమే ఐదేళ్లుగా వేధింపులను పంటిబిగువున భరించా. కానీ ఆ పిల్లలనే నిర్దయగా బొండిగ పట్టుకొని ఆయన పైకి లేపుతుంటే చూస్తూ భరించడం నా వల్ల కావడం లేదు. నా ఓపిక నశించింది. ఇద్దరు పిల్లలతో కలిసి మరణాన్ని ఆశ్రయిస్తున్నానమ్మా’.. అంటూ ఆ తల్లి తన తల్లితో వాట్సప్‌ మెసేజ్‌లో తన ఆవేదనను వెళ్లబోసుకుంది. ‘కట్నంగా వచ్చే డబ్బు, బంగారం, భూమిపై ఆశతోనే నన్ను ఆయన పెళ్లి చేసుకున్నాడమ్మా. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే ఉద్యోగం చేయమని ఒత్తిడి తెచ్చారు. చేస్తాను.. ఆరు నెలలు గడువు ఇవ్వండని కోరినా కనికరించలేదు. చెప్పిన మాట వినలేదనే అక్కసుతో మరుగుతున్న నూనెను నా కుడిచేతిపై పోశారు. బలవంతంగా అబార్షన్‌ చేయించారు. నా వద్ద వున్న బంగారం, వెండి ఆభరణాల్లో కొంత లాక్కున్నారు. ఆయన నా కళ్లముందే పిల్లల బొండిగ పట్టి పైకిలేపుతుంటే భరించలేకపోతున్నా. ఐదేళ్ల నా వైవాహిక జీవితంలో అనుభవించిన వేధింపులతో విసిగిపోయా. కొన్నాళ్లుగా రెండెకరాలను రాసిస్తావా.. చస్తావా? అంటూ బెదిరిస్తున్నారు. భూమిని ఫిబ్రవరి 11న రిజిస్ట్రే‌షన్‌ చేయించమంటూ వేధిస్తున్నారు. మాట వినకుంటే చంపుతామంటున్నారు. ఆడపడచు వేద, ఆమె భర్త కూడా నన్ను హింసిస్తున్నారు. నా మరణానికి వారే కారణం. వాళ ్లను వదలొద్దు. అమ్మా.. నీ ముందు వాళ్లంతా ఏమీ తెలియనట్లుగా నటిస్తారు. వారు చెప్పే మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దు. పిల్లలతో కలిసి నేను చనిపోతున్నా మీరంతా బావుండాలి’ అంటూ మెసేజ్‌లో స్రవంతి తల్లితో తన ఆవేదనను చెప్పుకుంది.

బలవన్మరణానికి పాల్పడుతున్నందుకు తనను క్షమించాలని తల్లి, సోదరులను వేడుకుంది. తన వార్డ్‌రోబ్‌లో ఒక బ్లాక్‌ సూట్‌కేసులో విలువైన వస్తువులను ఉంచి తాళం వేశానని. తనకు సంబంధించిన వస్తువులన్నీ తల్లి మాత్రమే తెరిచి చూడాలని పేర్కొంది. మరో రెడ్‌ బ్యాగ్‌లో తనకు ఇష్టమైన చీరలు, డ్రెస్సులు పెట్టానని తెలిపింది. కాగా, తన కూతురు పంపిన మెసేజ్‌ను చూపుతూ స్రవంతిరెడ్డి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

నిందితుల అరెస్ట్ స్రవంతిరెడ్డి,

ఇద్దరు చిన్నారుల అంత్యక్రియలు సోమవారం మచ్చబొల్లారం శ్మశానవాటికలో భర్త వెంకటేశ్వర్‌రెడ్డి నిర్వహించాడు. అంత్యక్రియలు ముగిసేంత వరకూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం స్రవంతి భర్త వెంకటేశ్వర్‌రెడ్డి, అత్త శారద, మామ దేవేందర్‌రెడ్డి, ఆడపడుచు వేద, ఆమె భర్తను అల్వాల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *