కదిలిన డొంకతో సినీనటుడికి చుక్కలు

అమ్మ మరణంతో జరుగుతున్న ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు అయిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఒక ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరుగుతుందన్న ఆరోపణపై నిలిపివేసిన ఉదంతం జరగలేదనే చెప్పాలి. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో విజయం కోసం ఓటర్లకు రూ.89కోట్ల మేర డబ్బులు పంచిన వైనానికి సంబంధించిన ఆధారాలు లభ్యం కావటంతో ఎన్నికను నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. డబ్బు పంపిణికి సంబంధించి మంత్రి విజయభాస్కర్ వద్ద ఆధారాలు లభించటం.. అందులో సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు.. నటుడు శరత్ కుమార్.. అన్నాడీఎంకే మాజీ ఎంపీ చీట్లపాక్కం రాజేంద్రన్ కూడా పాత్ర ఉందన్న విషయం బయటకు రావటంతో.. వారిని కూడా విచారణ పరిధిలోకి తీసుకున్నారు అధికారులు.

భారీ నగదు పంపిణీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి విజయ్ భాస్కర్ ను నాలుగు గంటలకు పైనే ఐటీ అధికారులు విచారణ జరిపారు. ఒక దశలో మంత్రిని అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం జరగటంతో.. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కటమే కాదు.. ఐటీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఆయన్ను అరెస్ట్ చేయకుండా.. విచారించి వదిలేశారు. ఇదిలాఉండగా.. నటుడు శరత్ కుమార్.. చీట్ల పాక్కం రాజేంద్రన్ ను వేర్వేరుగా అధికారులు విచారించటం గమనార్హం. ఇటీవల మంత్రి విజయభాస్కర్.. నటుడు శరత్ కుమార్ తదితరుల ఇళ్లపై ఐటీ వర్గాలు దాడి చేసి పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నాయి. వీటిల్లో లభించిన ఆధారం ప్రకారం.. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయటానికి ఎవరికెంత మొత్తాన్ని అందించాలన్న విషయానికి సంబంధించిన లెక్కలున్న పత్రాలు లభించాయి. వీటి ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికను వాయిదా వేసింది.

ఐటీ అధికారులకు లభించిన ఆధారాల ప్రకారం.. ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంచటానికి వివిధ కమిటీల్ని వేసి.. ఒక్కోకమిటికి భారీగా నిధులు కేటాయించారు. ఇందులో ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని కమిటీకి రూ.13.27 కోట్లు (22193 ఓట్ల కోసం).. మంత్రి సెంగోటయ్యన కమిటీకి రూ.13.13కోట్లు (32830 ఓట్ల కోసం).. మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కు రూ.18.83కోట్లు.. మంత్రి తంగమణికి రూ.1267 కోట్లు.. వేలుమణికి రూ.14.91 కోట్లు.. జయకుమార్ కు రూ.11.68కోట్లు.. మాజీ మంత్రి వైద్య లింగానికి రూ.11.13 కోట్లు కేటాయించినట్లుగా ఆధారాలు లభించాయి. తాజాగా లభించిన ఆధారాల పుణ్యమా అని అధికార అన్నాడీఎంకే నేతలకు కష్టాలు తప్పవన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఐటీ వర్గాలుస్వాధీనం చేసుకున్న నోట్లలో రూ.2వేల నోట్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక.. రూ.2వేల కొత్త నోట్లు రూ.2లక్షలకు మించి లభిస్తే సీబీఐ విచారణ జరపాలని ప్రధాని మోడీ ఆదేశించిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి మొదలు.. ఇతర మంత్రులు.. సినీనటుడు శరత్ కుమార్ వరకూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *