జాదవ్ శిక్షను పునఃసమీక్షించాలని పాక్ కు ఆదేశామిచ్చిన ఐసీజే

కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల భారత్‌ హర్షం వ్యక్తం చేసింది. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌(49)కు పాకిస్తాన్‌ విధించిన మరణ శిక్షను ఆ దేశం తప్పనిసరిగా పునఃసమీక్షించాలని నెదర్లాండ్స్ లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్‌ఖవీ అహ్మద్‌ యూసఫ్‌ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతూ జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని, ఆయనకు విధించిన శిక్షను పాక్‌ పునఃసమీక్షించాలని ఆదేశించింది.

గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కుల్‌భూషణ్‌ను 2016లో తమ సైనికులు అదుపులోకి తీసుకొన్నట్లు పాక్‌ చెబుతోంది. విచారణ చేపట్టిన సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో జాదవ్‌కు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనితో గత ఫిబ్రవరిలో మరోసారి విచారణ చేపట్టింది. రెండు దేశాల వాదనలను పరిగణనలోకి తీసుకుని బుధవారం తీర్పు వెల్లడించింది.

ఇండియా తరఫున న్యాయవాది హరీష్‌ సాల్వే వాదించారు. పాకిస్తాన్‌ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్‌ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ‘నిర్బంధంలో వున్న కుల్‌భూషణ్‌ జాధవ్‌ను కలిసేందుకు, ఆయనకు సహాయం అందించేందుకు భారత అధికారులను పాక్‌ అనుమతించకపోవడం ద్వారా, ఇండియా హక్కులను పాక్‌ కాలరాసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్‌ అరెస్టు, నిర్బంధం గురించిన సమాచారాన్ని భారత్‌కు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత పాక్‌కు ఉంది’ అని జడ్జి యూసఫ్‌ పేర్కొన్నారు. జాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును   పునఃసమీక్షించాలని, అప్పటిదాకా శిక్ష అమలు చేయవద్దని ఐసీజే పాక్‌కు స్పష్టం చేసింది. 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *