పదేళ్ళలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా నిత్యపెళ్లికొడుకు

 

గంగనాథన్‌ అనే వ్యక్తి కోమలాదేవి, కవిత, యుమున, దీప అనే యువతులను ఒకరికి తెలియకుండా ఒకరిని మొత్తం నలుగురిని పెళ్లాడిన పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు.

రామనాథపురం జిల్లా ఆళకన్‌కుళానికి చెందిన కోమలాదేవి అనే బీకాం పట్టభద్రురాలు అదే ప్రాంతంలోని ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మాడకోట్టాన్‌ ప్రాంతానికి చెందిన గంగనాథన్‌ అనే వ్యక్తితో 2008లో కోమలాదేవికి పెళ్లిచూపులయ్యాయి. దుబాయ్‌లో ఉద్యోగం. చేతినిండా సంపాదన, చూడ్డానికి సినిమా స్టార్‌లా వేషధారణ, ముఖ కవళికలు. వరుడి వేటలో ఉన్న యువతికి ఇంతకంటే ఏమి కావాలి. మారుమాటడకుండా మనువాడింది.

పెళ్లికాగానే కోమలాదేవిని దుబాయ్‌కి తీసుకెళ్లి కొత్తగా ఒక సంస్థను నెలకొల్పి బాగా సంపాదించాడు. అయితే గంగనాథన్‌ రాత్రివేళల్లో తరచూ బయటకు వెళ్లడంతో కోమలాదేవి అనుమానం వచ్చి తగవుపెట్టుకుంది దీంతో కోమలాదేవిని ఇండియాకు తీసుకొచ్చి రామనాథపురంలో వదిలిపెట్టాడు. కొన్ని రోజుల తరువాత ఒక్కడే దుబాయ్‌ వెళ్లిపోయి అప్పుడప్పుడూ భార్య వద్దకు వచ్చేవాడు. ఇలా ఒకసారి రామనాథపురం వచ్చినపుడు గంగనాథన్‌ సెల్‌ఫోన్‌కు మిస్డ్‌కాల్‌ వచ్చింది.

భర్త సెల్‌ఫోన్‌ నుంచి అ నంబరుకు కోమలాదేవీ ఫోన్‌ చేయగా గంగనాథన్‌కు చిన్నసేలంకు చెందిన కవిత అనే యువతితో రెండో వివాహమైందని, ఆమె గర్భంతో ఉన్నట్లు తెలుసుకుని బిత్తరపోయింది. భర్తను నిలదీయగా కవిత ఎవరో తనకు తెలియదని బుకాయించాడు. అయితే అతన్నినమ్మని కోమలాదేవి రహస్యంగా అతని సెల్‌ఫోన్‌ నంబర్లను సేకరించి విచారణ జరిపి చెన్నైకి చెందిన యమున అనే యువతిని మూడో భార్యగా, దీప అనే మహిళను నాల్గో భార్యగా వివాహమాడినట్లు తెలుసుకుంది. రేషన్‌కార్డులో భార్య కవిత, వారి కుమారుడు శ్రీధరన్‌ పేర్లను చేర్చాడు. ఇలా ఒక్కో భార్యతో వేర్వేరు విలాసాలు, రేషన్‌కార్డులు, ప్రభుత్వ నకిలీ డాక్యుమెంట్లు పొందాడు. అన్ని మోసాలను తెలుసుకున్న కోమలాదేవి భర్తపై రామనాథపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఈప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా అతను నిజం బయటపడకుండా ఉంటే ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకొనేవాడో.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *