పాతనోట్లకు బినామీగా మారితే ఏడేళ్ల జైలుశిక్ష

సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. బ్లాక్ మనీకి బినామీలుగా వ్యవహరించే వారికి చెక్ పెట్టేందుకు వీలుగా కఠిన నిర్ణయాన్ని వెలువరించింది. అక్రమార్కులకు షాకిస్తూ.. పాత నోట్లను బినామీ పద్దతుల్లో మారుద్దామని అనుకునే వారికి తీవ్రమైన హెచ్చరిక చేసేలా నిర్ణయాన్ని తీసుకుంది.తమ ఖాతాల్లో నల్లధనాన్ని భారీగా డిపాజిట్ చేసే వారిపై బినామీ చట్టాన్ని ప్రయోగించాలని డిసైడ్ అయ్యింది.

లెక్క చూపని పాత నోట్లను అక్రమ పద్ధతుల్లో మార్చుకునే ప్రయత్నం చేస్తే.. బినామీ వ్యవహారాల చట్టం కింద జరిమానాతో పాటు ఏడేళ్ల జైలుశిక్ష వరకూ శిక్ష తప్పదని తేల్చిన ఐటీశాఖ.. ఈ తరహాలో నోట్లను మార్చుకునే ప్రయత్నం చేసిన వారిని తాము గుర్తించినట్లు వెల్లడిచింది. ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం తర్వాత (నవంబరు 8 తర్వాత) దాదాపు రూ.50 కోట్లను సీజ్ చేసినట్లుగా ఐటీశాఖ పేర్కొంది.

నవంబరు 8 తర్వాత వివిధ బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు డిపాజిట్ చేస్తున్న అనుమానాస్పద ఖాతాలపై నిఘా పెట్టిన ఐటీ శాఖ ఇప్పటికే అలాంటి ఖాతాల్ని గుర్తించినట్లుగా పేర్కొంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్ము కానీ అక్రమమైనదని తేలితే బినామీ చట్టాన్ని ప్రయోగిస్తామని.. స్థిర.. చరాస్తులు రెండింటికీ ఈ చట్టం వర్తిస్తుందని చెప్పిన ఐటీశాఖ..భారీ జరిమానాతో పాటు.. ఏడేళ్ల వరకూ జైలు శిక్ష తప్పదని వార్నింగ్ ఇస్తోంది. కమీషన్ కక్కుర్తితో బినామీలుగా వ్యవహరించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న ఆశపరులకు.. అలాంటి పని చేస్తే తిప్పలు తప్పవన్న విషయాన్ని తాజాగా ప్రభుత్వం చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *