కొట్టేశాం… సెమీస్‌ బెర్త్‌ని, దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు

సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. పరిస్థితులకు తగ్గట్టుగా లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులు విసురుతూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను అద్భుతంగా కట్టడి చేశారు. దీంతో ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లాంటి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో సఫారీ జట్టుపై గెలిచింది. ఫలితంగా విరాట్‌సేన సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోగా, డివిలియర్స్ బృందం మరోసారి చోకర్స్‌గా మిగిలిపోతూ ఇంటిముఖం పట్టారు. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. డికాక్ (72 బంతుల్లో 53; 4 ఫోర్లు), డు ఫ్లెసిస్ (50 బంతుల్లో 36; 1 ఫోర్), ఆమ్లా (54 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత భారత్ 38 ఓవర్లలో 2 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధవన్ (83 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లీ (101 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) నిలకడగా ఆడారు. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. గురువారం జరిగే సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడనుంది.

టాస్‌ గెలిచిన కోహ్లి ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డికాక్, ఆమ్లా ప్రారంభించారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడటంతో తొలి 10 ఓవర్లలో 35 పరుగులే వచ్చాయి. కోహ్లి స్పిన్నర్లను దించినా…రన్‌రేట్‌ మందగించినా… వికెట్‌ కాపాడుకొని ఓపెనర్లు శుభారంభమిచ్చారు. జట్టు స్కోరు 76 పరుగుల వద్ద ఎట్టకేలకు ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో అశ్విన్‌… ఆమ్లా (54 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ తీసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత వచ్చిన డుప్లెసిస్‌ (50 బంతుల్లో 36; ఒక ఫోర్‌) కూడా నింపాదిగానే ఆడటంతో 22వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. డికాక్‌ 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక ఆ మరుసటి ఓవర్లోనే జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

ఇంతదాకా బాగానే ఉన్నా జట్టు స్కోరు 140 పరుగుల వద్ద డివిలియర్స్‌ (16) రనౌట్‌తో మొదలైన పతనం వడివడిగా సఫారీని ముంచేసింది. సమన్వయ లోపంతో ఆ తర్వాతి ఓవర్లోనే మిల్లర్‌ (1) కూడా రనౌట్‌ కాగా, మోరిస్‌ (4), ఫెలుక్‌వాయో (4)లను బుమ్రా ఔట్‌ చేశాడు. రబడ (5), మోర్కెల్‌ (0) భువీ బౌలింగ్‌లో నిష్క్రమించారు. ఫలితంగా 140/2 స్కోరుతో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా 191కే ఆలౌటైంది. ఓవైపు డుమిని (20 నాటౌట్‌) పోరాడుతున్నా మరో ఎండ్‌లో వికెట్ల పతనంతో ఏమీ చేయలేని స్థితి. తాహిర్‌ (1)తో రనౌట్ల సంఖ్య 3కు చేరింది. సఫారీ జట్టు చివరి 8 వికెట్లను కేవలం 51 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం

‘సూపర్‌’ శిఖర్‌
భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. ఆరో ఓవర్లోనే రోహిత్‌ శర్మ (12) వికెట్‌ పడినప్పటికీ కెప్టెన్‌ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చేయాల్సిన లక్ష్యం సులువైనదే కావడంతో భారీషాట్లకు వెళ్లకుండా బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో భారత్‌ 13వ ఓవర్లో 50 పరుగుల్ని, 21వ ఓవర్లో 100 పరుగుల్ని అధిగమించింది. ప్రత్యర్థి కెప్టెన్‌ బౌలర్లందరిని మార్చిమార్చి ప్రయోగించినా శిఖర్, కోహ్లిల ఏకాగ్రతను దెబ్బతీయలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా ధావన్‌ 61 బంతుల్లో, కోహ్లి 71 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. లక్ష్యం దిశగా సాగుతున్న తరుణంలో జట్టు స్కోరు 151 పరుగుల వద్ద ధావన్‌ ఔటయ్యాడు. తాహిర్‌ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్, కోహ్లితో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేశాడు.

40 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో సఫారీపై టీమిండియా రికార్డిది. 2000, 2002, 2013, 2017లో గెలిచింది.

51/8 డివిలియర్స్‌ సేన చివరి 8 వికెట్లను 51 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఒక దశలో 140/2తో పటిష్టంగా ఉంది.

6 ఈ టోర్నీలో భారత ఫీల్డర్లు చేసిన రనౌట్లు. ఇంకే జట్టు 2 రనౌట్లను దాటలేదు.

271 ఈ టోర్నీలో శిఖర్‌ ధావన్‌ చేసిన పరుగులివి. ఇంకెవరూ ఇతని దరిదాపుల్లో లేరు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *