దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం – ఇది కోహ్లీ చరిత్ర

భారత్ వరుస విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. సొంతగడ్డపై తమకు ఎదురే లేదనుకున్న దక్షిణాఫ్రికా ఆధిపత్యానికి గండికొడుతూ టీమ్‌ఇండియా జయకేతనం ఎగురవేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 124 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. మరో మూడు వన్డేలు మిగిలున్న సిరీస్‌లో 3-0తో ముందంజ వేసింది. భారత్ నిర్దేశించిన 304 పరుగుల భారీ లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. స్పిన్ ద్వయం చాహల్(4/46), కుల్దీప్ యాదవ్(4/23) స్పిన్ విజృంభణతో సఫారీలను ఆటాడుకున్నారు.

డుమిని(51) అర్ధసెంచరీ మినహా..ఎవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఆదిలోనే ఆమ్లా(1) వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ భారత్‌కు పోటీనివ్వలేకపోయింది. తొలుత కెప్టెన్ కోహ్లీ(159 బంతుల్లో 160 నాటౌట్, 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో భారత్ 50 ఓవర్లలో 303/6 స్కోరు చేసింది. ధవన్(76) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. డుమిని(2/60) రెండు వికెట్లు తీశాడు. సెంచరీతో విజృంభించిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే ఈనెల 10న జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.

రోహిత్ మళ్లీ: తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న హిట్‌మ్యాన్ రోహిత్(0)ను రబాడ వికెట్ల ముందు దొరుకబుచ్చుకున్నాడు. దీంతో పరుగుల ఖాతా తెరువకుండానే భారత్ వికెట్ చేజార్చుకుంది.

ధవన్ జతగా: సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి ఆదిలోనే ప్రత్యర్థికి తలొగ్గిన భారత్‌ను కోహ్లీ(160 నాటౌట్) నాయకునిలా నడిపించాడు. ఓపెనర్ ధవన్(76)తో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశాడు. తానెదుర్కొన్న మూడో బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి డీఆర్‌ఎస్‌తో బయటపడ్డ కోహ్లీ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ధవన్‌ను అండగా చేసుకుని కోహ్లీ బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో రెగ్యులర్ పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఈ క్రమంలో 42 బంతుల్లో ధవన్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ దశలో డుమిని(2/60)దక్షిణఫ్రికాకు బ్రేక్ ఇచ్చాడు. భారీ షాట్ ఆడే క్రమంలో హిట్టింగ్ చేయబోయిన ధవన్..కెప్టెన్ మక్క్రామ్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని తెరపడింది.

కోహ్లీ ఒక్కడై: ధవన్ ఔట్ తర్వాత కోహ్లీ గేర్ మార్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే(11) తీవ్రంగా నిరాశపరిచాడు. కోహ్లీకి మద్దతుగా నిలువాల్సిందిపోయి..డుమిని బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి ఫెల్కువాయో చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్‌పాండ్యా(14) ఆదిలో కొంత దూకుడుగా కనిపించినా స్థాయి మేరకు ఆడటంలో విఫలమయ్యాడు. ఓ భారీ సిక్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన హార్దిక్…మోరిస్ వేసిన మరుసటి ఓవర్లోనే కీపర్ క్యాచ్‌తో ఔటయ్యాడు. ఇలా 48 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా 3 వికెట్లు కోల్పోయింది.

ఓ వైపు వరుసగా వికెట్లు కోల్పోతున్నా చెదరని ఆత్మవిశ్వాసంతో కోహ్లీ పరుగులు కొల్లగొట్టాడు. ధోనీ(10)తో కలిసి సఫారీ బౌలర్లను కుదురుకోనీయకుండా స్కోరుబోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 34వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఎనిమిది పరుగుల తేడాతో ధోనీ, కేదార్ జాదవ్(1) ఔటయ్యారు. అయినా వెనుకకు తగ్గని కోహ్లీకి భువనేశ్వర్(16 నాటౌట్) మంచి మద్దతు ఇచ్చాడు. సమయస్ఫూర్తితో ఆడుతూ ఓవైపు..చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఓ ఫోర్, సిక్స్‌తో 15 పరుగులు పిండుకుని దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాడు.

స్కోరుబోర్డు

భారత్: రోహిత్‌శర్మ(సి)క్లాసెన్(బి)రబాడ 0, ధవన్(సి)మక్క్రామ్(బి)డుమిని 76, కోహ్లీ 160 నాటౌట్, రహానే(సి)ఫెల్కువాయో(బి)డుమిని 11, హార్దిక్(సి)క్లాసెన్(బి)మోరిస్ 14, ధోనీ(సి)ఎంగ్డీ(బి)తాహీర్ 10, జాదవ్(సి)క్లాసెన్(బి)ఫెల్కువాయో 1, భువనేశ్వర్ 16 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 50 ఓవర్లలో 303/6; వికెట్ల పతనం: 1-0, 2-140, 3-160, 4-188, 5-228, 6-236; బౌలింగ్: రబాడ 10-1-54-1, ఎంగ్డీ 6-0-47-0, మోరిస్ 9-0-45-1, ఫెల్కువాయో 6-0-42-1, తాహీర్ 9-0-52-1, డుమిని 10-0-60-2.

దక్షిణాఫ్రికా: ఆమ్లా(ఎల్బీ)బుమ్రా 1, మక్క్రామ్(స్టంప్/ధోనీ)(బి)కుల్దీప్ 32, డుమిని (ఎల్బీ)చాహల్ 51, క్లాసెన్(ఎల్బీ)చాహల్ 6, మిల్లర్(సి)ధోనీ(బి)బుమ్రా 25, జొండో (సబ్/పాండే)(బి)చాహల్ 17, మోరిస్ (ఎల్బీ)కుల్దీప్ 14, ఫెల్కువాయో(సి)కోహ్లీ(బి)కుల్దీప్ 3, రబాడ 12 నాటౌట్, తాహీర్(సి) కోహ్లీ(బి)చాహల్ 8, ఎంగ్డీ(ఎల్బీ)కుల్దీప్ 6; ఎక్స్‌ట్రాలు:4; మొత్తం: 40 ఓవర్లలో 179 ఆలౌట్; వికెట్ల పతనం: 1-1, 2-79, 3-88, 4-95, 5-129, 6-150, 7-150, 8-158, 9-167, 10-179; బౌలింగ్: భువనేశ్వర్ 7-0-41-0, బుమ్రా 7-0-32-2, హార్దిక్ 8-0-35-0, చాహల్ 9-0-46-4, కుల్దీప్ 9-1-23-4.

1 దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌లో మూడో విజయం అందించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *