వన్డే సిరీస్‌నూ నెగ్గిన భారత్‌

శ్రీలంకపై భారత్‌ విజయ యాత్ర కొనసాగుతోంది. అంచనాలకు తగినట్టుగానే వన్డే సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకుంది. 218 పరుగుల స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో… రోహిత్‌ శర్మ తన అద్భుత సెంచరీతో జట్టును నిలబెట్టాడు. అతడికి జతగా ‘మిస్టర్‌ కూల్‌’ మరోసారి తన విలువైన ఇన్నింగ్స్‌ ఆడటంతో  లంక మరోసారి భంగపడింది. అంతకుముందు పేసర్‌ బుమ్రా కెరీర్‌లో తొలిసారిగా ఐదు వికెట్లతో చెలరేగి ఆతిథ్య జట్టు వెన్నువిరిచాడు. ఇక మిగిలిన రెండు వన్డేలు నామమాత్రమే కావడంతో భారత్‌ తమ రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించే అవకాశం చిక్కినట్టే.

పల్లెకెలె: సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక ఎప్పటిలాగే చేతులెత్తేసింది. లంక గడ్డపై రోహిత్‌ శర్మ తొలిసారి సెంచరీ (145 బంతుల్లో 124 నాటౌట్‌; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) అందుకోగా… సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఎంఎస్‌ ధోని (86 బంతుల్లో 67 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) తన ఫామ్‌ను మరోసారి చాటుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను కోహ్లి బృందం మరో రెండు వన్డేలు మిగిలి ఉండగానే దక్కించుకున్నట్టయ్యింది.

1997 తర్వాత భారత్‌పై లంక ఇప్పటిదాకా వన్డే సిరీస్‌ గెలవకపోవడం గమనార్హం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 217 పరుగులు చేసింది. తిరిమన్నె (105 బంతుల్లో 80; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చండిమాల్‌ (71 బంతుల్లో 36; 4 ఫోర్లు) మాత్రమే రాణించగలిగారు. బుమ్రా 27 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 45.1 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసి గెలిచింది. రోహిత్, ధోని మధ్య ఐదో వికెట్‌కు అజేయంగా 157 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ధనంజయకు రెండు వికెట్లు దక్కాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా బుమ్రా నిలిచాడు. సిరీస్‌లోని నాలుగో వన్డే ఈనెల 31న కొలంబోలో జరుగుతుంది.

బుమ్రా ధాటికి విలవిల…
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తమ బ్యాటింగ్‌లో మరోసారి నిరాశపరిచింది. పేసర్‌ బుమ్రా ధాటికి ఆరంభం నుంచే వణికింది. అయితే 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సిరీస్‌లో తొలిసారి ఆడుతున్న చండిమాల్, తిరిమన్నె జట్టును ఆదుకున్నారు. ఓపిగ్గా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. కానీ అతిజాగ్రత్తకు పోవడంతో పరుగులు నిదానంగా వచ్చాయి. 26వ ఓవర్లో జట్టు వంద పరుగులు పూర్తి చేయగలిగింది. అయితే అదే ఓవర్‌లో పాండ్యా.. చండిమాల్‌ను అవుట్‌ చేశాడు. డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో బుమ్రా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

దీంతో మూడో వికెట్‌కు 72 పరుగుల కీలక భాగస్వామం ముగిసింది. 69 బంతుల్లో తిరిమన్నె అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కొద్దిసేపటికే జాదవ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ ఆడబోయిన మాథ్యూస్‌ (11) ఎల్బీ అయ్యాడు. తను రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత బుమ్రా ప్రమాదకరంగా మారిన తిరిమన్నెను వెనక్కి పంపడంతో లంక ఓ మాదిరి స్కోరు కూడా చేయలేక పోయింది. కెప్టెన్‌ కపుగెడెర (14)ను అక్షర్‌ అవుట్‌ చేయగా.. తన వరుస ఓవర్లలో బుమ్రా విజృంభించి ధనంజయ (2), సిరివర్ధన (29)ను అవుట్‌ చేయడంతో కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లను పడగొట్టాడు. 47వ ఓవర్‌ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌కు స్వల్పంగా అంతరాయం కలిగింది.

రోహిత్, ధోని దూకుడు…
స్వల్ప స్కోరే అయినా భారత్‌ ఆదిలోనే తడబడింది. మూడో ఓవర్‌లోనే ధావన్‌ (5)ను మలింగ బౌల్డ్‌ చేయగా… వన్‌డౌన్‌లో దిగిన కోహ్లి (3)ని ఫెర్నాండో అవుట్‌ చేయడంతో 19 పరుగులకే రెండు వికెట్లు పడ్డాయి. దీంతో రాహుల్‌ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు)తో కలిసి రోహిత్‌ కొద్దిసేపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరి మధ్య మూడో వికెట్‌కు 42 పరుగులు వచ్చాయి. ధనంజయ తన తొలి ఓవర్‌లో రాహుల్‌ను అవుట్‌ చేయగా మరో ఓవర్‌లో జాదవ్‌ పనిపట్టాడు. 61/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన భారత్‌ను రోహిత్, ధోని ఆదుకున్నారు. 19వ ఓవర్‌లో రోహిత్‌ వరుసగా మూడు ఫోర్లు బాదడంతో పాటు 64 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. క్రమంగా ఈ జోడి లంక బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగింది. ఇదే జోరుతో రోహిత్‌ 118 బంతుల్లో లంక గడ్డపై తొలి సెంచరీని అందుకున్నాడు. 40వ ఓవర్‌లో రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను కపుగెడెర వదిలేశాడు. అటు ధోని 74 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

అభిమానుల అల్లరి…
లంక పేలవ ప్రదర్శనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేక్షకులు కాసేపు మైదానంలో అలజడి సృష్టించారు. 44వ ఓవర్‌లో ధోని సిక్సర్‌తో పాటు రోహిత్‌ ఓ బౌండరీ బాదడంతో 12 పరుగులు వచ్చాయి. అయితే ఈ ఓవర్‌ పూర్తయ్యాక భారత్‌ విజయానికి మరో ఎనిమిది పరుగులు అవసరం కాగా సహనం కోల్పోయిన లంక ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లను విసరడంతో మ్యాచ్‌ అర్ధగంట సేపు ఆగింది. చాలాసేపు తర్జనభర్జనల అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. మైదానంలోని ప్రేక్షకులను భద్రతా సిబ్బంది బయటికి పంపిన అనంతరం ఆటను తిరిగి కొనసాగించగా మరో ఏడు బంతుల్లో భారత్‌ లక్ష్యాన్ని అందుకుంది.

స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్‌: డిక్‌వెలాఎల్బీడబ్లు్య (బి) బుమ్రా 13; చండిమాల్‌ (సి) బుమ్రా (బి) పాండ్యా 36; కుశాల్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 1; తిరిమన్నె (సి) జాదవ్‌ (బి) బుమ్రా 80; ఏంజెలో మాథ్యూస్‌ ఎల్బీడబ్లు్య (బి) జాదవ్‌ 11; కపుగెడెర (బి) అక్షర్‌ 14; సిరివర్ధన (బి) బుమ్రా 29; ధనంజయ (బి) బుమ్రా 2; చమీర (రనౌట్‌) 6; ఫెర్నాండో నాటౌట్‌ 5; మలింగ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 217.

వికెట్ల పతనం: 1–18, 2–28, 3–100, 4–138, 5–159, 6–181, 7–191, 8–201, 9–210.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 9–2–41–0; బుమ్రా 10–2–27–5; చాహల్‌ 10–0–49–0; పాండ్యా 8–0–42–1; అక్షర్‌ 10–1–35–1; జాదవ్‌ 3–0–12–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ నాటౌట్‌ 124; ధావన్‌ (బి) మలింగ 5; కోహ్లి (సి) చమీర (బి) ఫెర్నాండో 3; రాహుల్‌ (సి) తిరిమన్నె (బి) ధనంజయ 17; జాదవ్‌ ఎల్బీడబ్లు్య (బి) ధనంజయ 0; ధోని నాటౌట్‌ 67; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (45.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 218

వికెట్ల పతనం: 1–9, 2–19, 3–61, 4–61.

బౌలింగ్‌: మలింగ 5–0–25–1; ఫెర్నాండో 8.1–2–35–1; చమీర 10–1–59–0; మాథ్యూస్‌ 3–0–17–0; ధనంజయ 10–0–38–2; సిరివర్ధన 9–0–43–0.

4  భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో అజహర్‌(9378)ను అధిగమించి నాలుగో స్థానానికి చేరిన ధోని (9434).
7 శ్రీలంకపై వరుసగా 7 వన్డే సిరీస్‌లు నెగ్గిన భారత్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *