చరిత్ర సృష్టించిన టీమిండియా

శ్రీలంక గడ్డపై భారత్ విజయఢంకా మోగించింది. కోహ్లి ద కాంకరర్ నేతృత్వంలో టీమిండియా విజయ పరంపర కొనసాగింది. కొలంబోలో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో భారత్ విజయ దుందుభి మోగించింది. 82 పరుగులు చేసి కోహ్లి మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మెరిపించే హాఫ్ సెంచరీతో మనీష్ పాండే చెలరేగడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 3 టెస్టులు, 5 వన్డేలు, ఒకేఒక్క టీ20 మొత్తంగా 9 మ్యాచుల్లోనూ భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మూడు ఫార్మాట్లలో క్లీన్ స్వీప్ చేసి క్రికెట్ హిస్టరీలో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది.

శ్రీలంక పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. కొలంబో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. కోహ్లీ సేన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ ముందు శ్రీలంక జట్టు వెలవెల బోయింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లంక ఆటగాళ్లలో మునవీర 53, ప్రియంజన్ 40 మాత్రమే రాణించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మునవీర చెలరేగి పోయాడు. 99 పరుగుల దగ్గర మునవీర ఔటవడంతో లంక స్కోరుకి కళ్లాలు పడ్డాయి.

ఏంజెలో మాథ్యూస్ ని కేవలం మిల్లీమీటర్ తేడాతో ధోనీ స్టంపౌంట్ చేయడం ఆటలో హైలైట్ గా నిలిచింది. చివరలో అషాన్ ప్రియంజన్ మెరుపులు మెరిపించడంతో లంక జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో చహల్ 3, కుల్దీప్ 2, భువనేశ్వర్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.

171 పరుగుల విజయలక్ష్యంతో దిగిన భారత్, తొందరగా ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. వన్ డౌన్ గా వచ్చిన కోహ్లీ, రాహుల్ తో కలిసి స్పీడ్ పెంచాడు. అంతలోనే 24 పరుగులు చేసిన రాహుల్ ఔటయ్యాడు. మనీష్ పాండే, కోహ్లీ స్కోరు గేర్లు మార్చారు. 82 పరుగులు చేసిన విరాట్ 10 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్ కొట్టబోయి ఔటయ్యాడు. టీ20ల్లో తన మొదటి హాఫ్ సెంచరీ చేసిన పాండే ధోనీతో కలిసి భారత్ కు విజయం అందించాడు. ఈ విజయంతో కోహ్లీసేన మరో అద్భుత రికార్డుని నెలకొల్పింది. శ్రీలంకను టెస్టుల్లో 3-0తో, వన్డేల్లో 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్.. ఏకైక టీ20లో కూడా గెలవడంతో 9-0తో శ్రీలంకను చిత్తుచేసి చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఆస్ట్రేలియా మాత్రమే ఈ ఘనత సాధించింది. 2009-10లో పాక్‌ను 3-0తో టెస్టుల్లో, 5-0తో వన్డేల్లో, 1-0తో టీ20లో ఓడించింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *