భారత్‌ ఘన విజయం: సిరీస్‌ కైవసం

కరీబియన్‌ గడ్డపై టీమ్‌ఇండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నాలుగో వన్డేలో అనూహ్య విజయం సాధించిన సిరీస్‌ రేసులో నిలిచిన హోల్డర్‌ సేన చివరిదైన ఐదో వన్డేలో విఫలమైంది. టీమిండియా సారధి విరాట్‌ కోహ్లి 111(115) సెంచరీతో కప్పును సొంతం చేసుకుంది. గురువారం కింగ్‌స్టన్‌లో జరిగిన ఆఖరి వన్డేలో వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించడంతో 3-1 తేడాతో సిరీస్‌ను కోహ్లీసేన సొంతం చేసుకుంది. కీలకమైన చివరి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన విండీస్‌, మహ్మద్‌ షమీ(4/48), ఉమేశ్‌ యాదవ్‌(3/53) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. హోప్‌ సోదరులు షెయ్‌(51), కైల్‌(46) పరుగులు చేశారు.

విజృంభించిన బౌలర్లు
టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. విండీస్‌ స్కోరు 39 వద్ద హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో లూయిస్‌(9) వెనుతిరగడంతో విండీస్‌ వికెట్ల పతనం ప్రారంభమైంది. ఉమేశ్‌ వరుస బంతుల్లో ఫీల్డర్‌ చేజ్‌ల పెవిలియన్‌ చేర్చాడు. 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్‌ను షెయ్‌, మహ్మద్‌లు కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇన్నింగ్స్‌ గాడిలో పెడుతున్నమహ్మద్‌(16)ను జాదవ్‌ ఔట్‌ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోల్డర్‌ ధాటిగానే ఆడాడు. 34 బంతులాడిన హోల్డర్‌ 4ఫోర్లు, సిక్సర్‌ లతో 36 పరుగులు చేశాడు. స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌లు ప్రత్యర్థి బౌలర్లను కట్టడి చేశారు.

రాణించిన విరాట్‌, రహానే
206 పరుగుల స్వల్ప ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోసెఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఆఖరి బంతికే శిఖర్‌ ధావన్‌(4) ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్‌, మరో ఓపెనర్‌ రహానె  వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. చెత్తబంతులను బౌండరీలు దాటిస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా సింగిల్స్‌ తీస్తూ లక్ష్యం వైపు అడుగులేశారు. భారీ భాగస్వామ్యం వైపు దూసుకెళ్తున్న ఈ జోడీని దేవేంద్ర బిషూ విడదీశాడు. 19వ ఓవర్‌ ఆఖరి బంతికి రహానె 39(51)ఎల్బీగా వెనుదిరిగాడు. విరాట్‌కోహ్లీ 22వ ఓవర్‌లో ఫోర్‌తో 67 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత కోహ్లీ తనదైన శైలిలో అలరించాడు. లక్ష్యానికి దగ్గరవుతున్నా కొద్దీ కోహ్లీ, కార్తీక్‌ ద్వయం భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. విలియమ్స్‌ వేసిన 35వ ఓవర్‌లో ఫోర్‌ బాదిన విరాట్‌ వన్డే కెరీర్‌లో 28వ శతకాన్ని సాధించాడు. 108 బంతులాడిన విరాట్‌ 12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 37వ ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసి కార్తీక్‌ 50(52)బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. శతకంతో రాణించిన ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను విరాట్‌ కోహ్లి అందుకోగా.. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును ఆజింక్య రహానె దక్కించుకున్నాడు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *