హెచ్1 బీ వీసాలపై భారత్ గేములాడుతోందట!

భారత్లోని నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల హాట్ డెస్టినేషన్ ఇప్పటికీ అమెరికానే. భారత సాంకేతిక నిపుణుల్లో ఎంత మేర సత్తా ఉందో తెలియాలంటే… అమెరికా గడ్డపై పురుడు పోసుకుని ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగిన మైక్రోసాఫ్ట్ – గూగుల్ – పెప్సికో తదితర సంస్థల అధినేతలను చూస్తేనే ఇట్టే అర్థం కాక మానదు. ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన ఈ సంస్థలకు అమెరికాకు వలస వెళ్లిన భారతీయులేనన్న వాస్తవాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఆ దేశ పాలకులు ఉన్నారనడానికి నిదర్శనంగా నిన్న ఓ చిన్న ఘటన చోటుచేసుకుంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశానికి వలస వస్తున్న నిపుణులను నిలువరించేందుకు హెచ్1 బీ వీసా చట్టంలో మార్పులు ప్రతిపాదిస్తూ ఓ బిల్లు ఆ దేశ చట్టసభల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ చట్టాన్ని ప్రతిపాదించిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల్లో ఒకరు అధికార పార్టీ రిపబ్లికన్ కాగా మరొకరు విపక్ష పార్టీ డెమోక్రటిక్. ఈ బిల్లును గెలిపించుకునేందుకు ట్రంప్ సర్కారు ఎంతగా ప్రయత్నిస్తుందో తెలియాలంటే… ఈ ఇద్దరు సభ్యుల కలయికే నిదర్శనమని చెప్పక తప్పదు. ఆ చట్టాన్ని ప్రతిపాదించిన ఇద్దరిలో ఒకరైన డారెల్ ఇసా… నిన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న హెచ్1 బీ వీసా చట్టంలోని లోపాలను ఆసరా చేసుకుని భారత కంపెనీలు గేమ్ ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. వాషింగ్టన్లో కేపిటల్ ఇన్వెస్టర్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఓ చర్చా కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న చట్టంతో గేములాడుతున్న భారత కంపెనీలు…. వీసాల్లోని దాదాపు 75 శాతం వాటాను ఎగురవేసుకుపోతున్నాయని ఆరోపించారు.

అయినా హెచ్1 బీ వీసా చట్టంలో మార్పులకు ప్రతిపాదించింది భారత్ను టార్గెట్ చేసి కాదని కూడా ఆయన తనదైన శైలి వాదనను వినిపించారు. అమెరికాకు వస్తున్న వసలదారుల్లో అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు ప్రతిపాదిస్తున్నామన్నారు. తాము ప్రతిపాదించిన మార్పులకు ట్రంప్ నుంచి మద్దతు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెనేట్లోనూ భారీ మెజారిటీతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు. ఇదంతా బాగానే ఉన్నా… అమెరికాకు వలస వచ్చే వారికి అత్యంత ప్రతిభా పాటవాలు ఉండాలన్న భావనతోనే అంటూ వ్యాఖ్యలు చేసిన ఇసా… ప్రస్తుతమున్న చట్టాలను భారత్ తనకు అనుకూలంగా మలచుకుని దందా సాగిస్తోందన్న కోణంలో ఆరోపణలు చేయడం ఎందుకో అర్ధం కాని పరిస్థితి.

ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం… తక్కువ వేతనాలకే అమెరికా వచ్చేస్తున్న వారితో చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోందని కూడా ఆయన మరో వాదనను వినిపించారు. అధిక వేతనాలతో వచ్చే వారితో పరిస్థితిలో ఎలా మార్పు వస్తుందో కూడా ఆయన చెప్పి ఉంటే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. ఏటోచ్చి తాను ప్రతిపాదించిన బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ఈ వితండ వాదాన్ని ఇసా వినిపిస్తున్నారని కూడా పలువురు అనుమానిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *