అక్కడ ‘ఐఫోన్’ చాలా చీప్ గురూ…!

అంగోలా: ‘చేతిలో ఐఫోన్ ఉంటే.. ఆ కిక్కే వేరప్పా..’ అని ఆశ పడేవారు చాలా మందే ఉంటారు. కానీ ఐఫోన్ ధర చూస్తే గుండె ‘లబ్ డబ్’ అని కాకుండా ‘లబోదిబో’ అని కొట్టేసుకుంటుంది. అయితే మీరు ఆఫ్రికన్ దేశమైన అంగోలాలో ఉంటే మాత్రం వీజీగా ఓ ఐఫోన్ ఓనర్ అయిపోవచ్చు.

ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఐఫోన్లు దొరికేది అక్కడే. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ లినియో జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 14 రకాల గ్యాడ్జెట్ల ధరలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను తాజాగా ‘టెక్నాలజీ ప్రైస్ ఇండెక్స్’ పేరుతో విడుదల చేసింది. మొత్తం 72 దేశాలలో ఒక్కో దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ప్రముఖ ఆన్ లైన్ రిటైల్ సంస్థలు పెట్టిన ధరలను క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

తక్కువ ధర మోడల్ నుంచి.. అత్యంత ఖరీదైన మోడల్ వరకు కలిపి సగటు ధరలను అందులో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. అంగోలాలో ఐఫోన్ సగటు ధర 401.4 డాలర్లు అంటే.. మన డబ్బులో రూ.27,290 మాత్రమే. అదే ఐఫోన్ ధర భారత్ లో 505.25 డాలర్లు కాగా అమెరికాలో దీని ధర 625.88 డాలర్లు అంటే.. రూ.43,230. ఇక ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నవెనెజులా దేశంలో అయితే ఐఫోన్ కొనే విషయంలో కోటీశ్వరులు సైతం వెనకడుగు వేసేలా ఉన్నాయట ధరలు. ఆక్కడ దీని సగటు ధర 97,813.82 డాలర్లు ( రూ.66 లక్షలు పైనే) ఉన్నట్లు లినియో నివేదిక వెల్లడించింది. ద్రవ్యోల్బణంలో తగ్గుదల, స్థానిక పన్నుల స్థాయిని బట్టి ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. అంగోలాలో పన్నులు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ మొబైల్ ఫోన్ల ధరలు తక్కువగా ఉంటాయి. ఇక వెనెజులాలో ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, దిగుమతులపై కఠిన నిబంధనలు అమలులో ఉండటం వాళ్ళ అక్కడ ధరలు భారీగా ఉన్నాయట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *