తమిళనాడులో ఐటీ దాడులు: 6కిలోల గోల్డ్, రూ.1.25కోట్లు సీజ్

చెన్నై: తమిళనాడులో ఆదాయపుపన్ను శాఖ(ఐటీ) అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు, అంతకుముందు శేఖర్ రెడ్డిల నివాసాలపై దాడులు చేసి వేల కోట్ల అక్రమ సొమ్మును వెలికి తీసిన ఐటీ అధికారులు.. తాజాగా తమిళనాడు ట్రెజరీ సెక్రటరీ, గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ నాగరాజన్ నివాసాలపై దాడులు కొనసాగిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 10మంది ఐటీ అధికారులు.. నాగరాజన్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 6కేజీల బంగారం, రూ. 1.25 కోట్ల నగదు బయటపడినట్లు తెలిసింది. పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా బయటపడినట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా, మాజీ మంత్రి యడప్పాటి బంధువుల ఇళ్లలో కూడా బుధవారం అర్ధరాత్రి వరకూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. వీరి దగ్గర కూడా పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు తెలిసింది. ఏకకాలంలో ఐటీ, ఈడీ, సీబీఐ అధికారులు దాడులు చేయడంతో తమిళనాడు రాజకీయ నేతలతోపాటు ఐఏఎస్ అధికారులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే 14 ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఐటీ అధికారులు కోట్లాది రూపాయలు, పెద్ద బంగారం నిల్వలను సీజ్ చేశారు. కాగా, సీఎస్ రామ్మోహన్ రావును ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దగ్గర 5కేజీల బంగారం, రూ.35లక్షల నగదు, భారీ ఆస్తులకు సంబంధించిన 40డాక్యుమెంట్ల, ఓ ల్యాప్‌టాప్‌ను ఐటీ అధికారులు ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విచారణ తర్వాత సీఎస్ ను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే, సీఎస్ బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని సీఎస్ వియ్యంకుడు భద్రినారాయణ ఇంట్లో కూడా బుధవారం తెల్లవారుజాము వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పెద్ధ ఎత్తున ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే, అధికారులు మాత్రం ఎంతమొత్తంలో స్వాధీనం చేసుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు. గురువారం తెల్లవారుజామునే అధికారులు మళ్లీ చెన్నైకి వెళ్లిపోయినట్లు సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *