హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ట్రంప్ కుమార్తె ఇవాంక

నగరంలో ఇవాళ్టి నుంచి జరగనున్న ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ నగరానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఇవాంకకు అమెరికా రాయబారి కెన్నత్ జుస్టర్ ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరుపున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆమెకు స్వాగతం పలికారు. అదనపు డీజీ అంజీకుమార్, ప్రోటోకాల్ కార్యదర్శి అరవిందర్‌సింగ్ ఇవాంకకు స్వాగతం పలికారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్‌లో ఇవాంక ట్రంప్ బస చేస్తున్నారు. ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో రెండు రోజుల పాటు ఇవాంక పాల్గొననున్నారు.

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్‌ఐసీసీకి ఇవాంక చేరుకోనున్నారు. ముందుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఇవాంక భేటీ కానున్నారు. అనంతరం ప్రధాని మోదీతో ఇవాంక భేటీ అవుతారు. సాయంత్రం 4.25 గంటలకు జీఈ సదస్సులో ఇవాంక పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదార్లతో ఇవాంక మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు ట్రైడెంట్ హోటల్ కు ఇవాంక చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ఇవాంక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. ప్యాలెస్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందులో ఆమె పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి ఇవాంక బయలుదేరి హోటల్‌కు వెళ్తారు.

ఈనెల 29న ఉదయం 10 గంటలకు మళ్లీ హెచ్ఐసీసీకి ఇవాంక చేరుకుంటారు. సదస్సు రెండో రోజు పలు ప్లీనరీల్లో ఆమె పాల్గొంటారు. పలువురు ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇవాంక తిరుగు ప్రయాణం అవనున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *