క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా జడేజా, అశ్విన్ సంచలనం

బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో సత్తా చాటిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌తో అశ్విన్‌తో కలిసి టాప్ బౌలర్‌గా నిలిచాడు. ఇద్దరు స్పిన్నర్లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగడం క్ద్రికెట్ చరిత్రలో ఇదే ప్రథమం కావడం విశేషం. బెంగళూరు టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో టెస్టు బౌలర్ల జాబితాలో తొలిసారిగా నంబర్ 1 స్థానానికి చేరకున్నాడు. గతంలో దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగారు.

బెంగళూరు టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ 266 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఖాతాలో 269 వికెట్లు ఉన్నాయి

 బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన నాథన్ లియాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి ఎగబాకాడు. స్టీవ్ ఒకీఫ్, ఉమేష్ యాదవ్ ఒక్కోస్థానం మెరుగుపర్చుకొని 28, 29వ స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బెంగళూరు టెస్టులో నిరాశాజనకమైన ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి రెండో స్థానాన్ని ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌కు కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసిన పుజారా ఐదుస్థానాలు మెరుగు పర్చుకొని ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఆసీస్‌పై అర్ధ సెంచరీలతో సత్తా చాటుతున్న కేఎల్ రాహుల్ 23 స్థానంలు మెరుగుపర్చుకున్నాడు. టెస్టుల్లో నంబర్ 1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న అశ్విన్ ఆ స్థానాన్ని బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబుల్ హసన్‌కు కోల్పోయాడు.

రెండో టెస్టులో గెలుపొందడంతో టెస్టుల్లో భారత్ ఏప్రిల్ 1 వరకు నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో ఐసీసీ టీమిండియాకు పది లక్షల డాలర్ల నగదు బహుమతిని అందించనుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *