సీడెడ్లో సింహామే.. కానీ నైజాంలో?

టాలీవుడ్లో కొందరు స్టార్ హీరోలకు కొన్ని ఏరియాలపై పట్టుంటుంది. పవన్ కళ్యాణ్‌కు ఉత్తరాంధ్ర, నైజాం ఏరియాల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. అక్కడ అతడి సినిమాలకు భారీ వసూళ్లు వస్తుంటాయి. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే ఆయనకు రాయలసీమపై మంచి పట్టుంది. ఇక్కడ బాలయ్య సినిమాలు మంచి కలెక్షన్లు రాబడుతుంటాయి. బాలయ్య కొత్త సినిమా ‘జై సింహా’ ఇక్కడ అంచనాల్ని మించి షేర్ రాబట్టింది. తొలి వారంలో ఈ చిత్రానికి సీడెడ్లో రూ.5 కోట్ల షేర్ వచ్చింది. దాదాపుగా బయ్యర్లందరూ సేఫ్ అయిపోయారు.

ఐతే ‘జై సింహా’ నైజాం ఏరియాలో మాత్రం తుస్సుమనిపించింది. నాలుగు జిల్లాలున్న రాయలసీమలో రూ.5 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం పది జిల్లాలున్న (పాత లెక్కల ప్రకారం).. అందులోనూ హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ ఉన్న ప్రాంతంలో ఏడు రోజులు కలిపి రూ.3.85 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో పోలిస్తే ఆంధ్రా ఏరియాలో వసూళ్లు మెరుగ్గానే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో రూ.2.88 కోట్లు.. మిగతా ఆంధ్రా జిల్లాలన్నీ కలిపి రూ.9 కోట్ల దాకా షేర్ వచ్చింది. మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండింట్లో కలిపి తొలి వారంలో రూ.20.5 కోట్ల షేర్ సాధించింది ‘జై సింహా’. వరల్డ్ వైడ్ షేర్ రూ.23.3 కోట్ల దాకా ఉంది. ఈ చిత్రం ఇంకో నాలుగు కోట్ల షేర్ రాబడితే లాభాల్లోకి వచ్చేస్తుంది. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి అదేమంత కష్టం కాకపోవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *