సుప్రీంకోర్టులో తమిళనాడుకు చుక్కెదురు

చెన్నై: జల్లికట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. పండుగ సందర్భంగా జల్లికట్టును అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది.

తీర్పు తర్వగా ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోరగా, సుప‍్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పు విషయంలో ఇలా అడగడం భావ్యం కాదని, తీర్పు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించింది. తమపై ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కాగా తమిళుల వంశపారంపర్య జల్లికట్టు క్రీడను యథావిధిగా నిర్వహించుకునేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. తమిళనాడులో పొంగల్‌ పండుగ దినాల్లో సుమారు రెండువేల ఏళ్లుగా జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే 2014 మే 7వ తేదీన జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. జల్లికట్టుపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సైతం అనేకసార్లు కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు.

తమిళుల వీరత్వాన్ని, సంప్రదాయాన్ని చాటే సాహసక్రీడగా జల్లికట్టు రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మధురై జిల్లా అలంగా నల్లూరులో సాగే  క్రీడ ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. అయితే, ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ జంతు ప్రేమికుల వాదనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.

దీంతో జల్లికట్టుకు 2014లో తమిళనాట బ్రేక్ పడింది. రెండేళ్లుగా జల్లికట్టులేని సంక్రాంతిని జరుపుకోక తప్పడం లేదు. అయితే, రాజకీయ లబ్ధి కోసం కేంద్ర, రాష్ట్రంలోని పాలకులు సంక్రాంతికి ముందు ఊరించే వాగ్దానాలు, భరోసా ఇచ్చే ప్రకటనలు సాగించినా, చివరకు న్యాయస్థానంలో మాత్రం నిరాశే మిగిలింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *