రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా

టైటిల్‌: జయమ్ము నిశ్చయమ్మురా
సమర్పణ: ఎ.వి.ఎస్‌.రాజు
బ్యాన‌ర్‌: శివరాజ్‌ ఫిలింస్‌
న‌టీన‌టులు: శ్రీనివాసరెడ్డి, పూర్ణ, రవివర్మ, కృష్ణభగవాన్‌, జీవా, ప్రవీణ్‌; శ్రీవిష్ణు, జోగిబ్రదర్స్‌
నిర్మాతలు: శివరాజ్‌ కనుమూరి, సతీష్‌ కనుమూరి
రచన, దర్శకత్వం: శివరాజ్‌ కనుమూరి
రిలీజ్ డేట్‌: 25 న‌వంబ‌ర్‌, 2016

కమెడియ‌న్ శ్రీనివాస్‌రెడ్డి కోన వెంక‌ట్ గీతాంజ‌లి సినిమాలో పూర్తి స్థాయిలో కాక‌పోయినా హీరోగా మారాడు. ఆ సినిమా స‌క్సెస్ అవ్వ‌డంతో శ్రీనివాస్‌రెడ్డి కూడా హీరోగా మెప్పిస్తాడ‌న్న అంచ‌నాలు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి శ్రీనివాస్‌రెడ్డి ఓ వైపు కమెడియ‌న్‌గా న‌టిస్తూనే పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. తాజాగా శ్రీనివాస్‌రెడ్డి హీరోగా పూర్ణ హీరోయిన్‌గా శివ‌రాజ్ క‌నుమూరి డైరెక్ష‌న్‌లో జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాలో న‌టించాడు. రిలీజ్‌కు ముందే ట్రైల‌ర్ల‌తో అంచ‌నాలు పెంచేసిన ఈ సినిమా ప్రీమియ‌ర్లు ముందే ప‌డిన సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మ‌రి శ్రీనివాస్‌రెడ్డి ఈ సినిమాతో హిట్ కొట్టాడో ? లేదో ? డెక్క‌న్ రిపోర్ట్‌. కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:

సర్వమంగళం( శ్రీనివాసరెడ్డి)కి మూఢ న‌మ్మ‌కాలు చాలా ఎక్కువ‌. చాలా భ‌య‌స్తుడు. మ‌నోడు అయిన దానికి కానిదానికి ఓ దొంగ బాబా(జీవా)పై ఆధారపడుతుంటాడు. పదేళ్లుగా ఉద్యోగం కోసం చూస్తోన్న అతడికి ఎట్ట‌కేల‌కు ఉద్యోగం వ‌స్తుంది. అయితే అదంతా ఆ దొంగ బాబా స‌ల‌హాతోనే వ‌చ్చింద‌ని అనుకుంటాడు. కాకినాడ మున్సిపల్ ఆఫీస్‌లో క్ల‌ర్క్‌గా జాయిన్ అవుతాడు. అక్క‌డ స‌ర్వ‌మంగ‌ళం పై అధికారి జే.సి(రవివర్మ) స్త్రీ లోలుడు. అందుకోసం అతను సర్వమంగళం ఉంటోన్న ఇంటినే వాడుతుంటాడు.

స‌ర్వ‌మంగ‌ళం అంత‌కుముందే హైద‌రాబాద్‌లో రాణి(పూర్ణ)ని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు.. తీరా చూస్తే ఆమె మ‌నోడు ప‌నిచేసే ఆఫీస్ పక్కనే మీసేవాలో పనిచేస్తుంటుంది. ఇక ఎలాగైనా రాణిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్ర‌మంలోనే రాణి న‌ర్స‌రీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఫైల్ మ‌నోడి వ‌ద్ద‌కే వ‌స్తుంది. అప్ప‌టి నుంచి ఆమెకు ద‌గ్గ‌ర‌య్యేందుకు మ‌నోడు ర‌క‌ర‌కాల ప్లాన్లు వేస్తుంటాడు.

కానీ స‌ర్వ‌మంగ‌ళానికి ఇంతోలోనే క‌రెంట్ షాక్ కొట్టిన‌ట్ల‌వుతంది. ఓ రోజు రాణి తనపై ఆఫీసర్ జేసితో కలిసి తన రూమ్ కు వస్తుంది. జేసీతో రాణిని చూసిన సర్వమంగళం ఏం చేశాడు ? రాణి నిజంగానే తప్పు చేసిందా.. ? ఆ తర్వాత రాణితో సర్వమంగళం ‘స్నేహం’ ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది మిగతా కథ.

విశ్లేష‌ణ‌:

తెలుగు సినిమాల్లో ఇలాంటి క‌థ‌తో సినిమాలు వ‌చ్చి చాలా కాల‌మైంది. ఎక్కడా ద్వంద్వర్థాలకు తావు లేకుండా చక్కగా తెరపై క‌థ‌ను ఆవిష్కరించాడు దర్శకుడు. పవన్‌కల్యాణ్‌ అత్తారింటికి దారేది సినిమా పోస్టర్‌ను కథకు తగిన విధంగా డైరెక్టర్‌ తెరపై చూపించిన విధానం బావుంది. చూడ‌డానికి ఇది ఓ సాధార‌ణ ప్రేమ‌క‌థే. కానీ ఆ క‌థ చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు, రాసుకున్న పాత్రలు, వారి ప్రవర్తనా అని మ‌నం – మ‌న చుట్టూ మనుష్యుల్లాగానే క‌న‌ప‌డ‌తాయి.

స‌మాజంలో మ‌నుష్యుల బ‌లాలు – బ‌ల‌హీన‌త‌లు, అనుబంధాలు, ఆక‌ర్ష‌ణ‌లు, ప్రేమల మధ్య ఉండే తేడాలు.. చెప్పుడు మాటల చేటు, డబ్బుకోసం ఎలాంటి పనికైనా దిగజారే మనుషులు, నిజాయితీని నమ్ముకుంటే ఎదుర్కొనే ఇబ్బందులు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ సినిమాలో కనిపించని అంశమే ఉండదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు గ‌తంలో మ‌నం వంశీ-రాజేంద్ర‌ప్ర‌సాద్ కాంబోలో వ‌చ్చిన కొన్ని సినిమాలు గుర్తుకు వ‌స్తాయి. అలాగ‌ని ఆ సినిమాల‌కు ఈ సినిమాకు అస్స‌లు పోలికే ఉండ‌దు.

క‌థ కృత్రిమంగా కాకుండా ముందుకు వెళ్లేలా ద‌ర్శ‌కుడు చిత్రీక‌రించిన సీన్లు సినిమాకు హైల‌ట్‌కే హైలెట్‌గా నిలిచాయి. అయితే సినిమాలో ఫ‌స్టాఫ్‌లోను, సెకండాఫ్‌లోను చాలా చోట్ల స్లోగా మూవ్ అవ్వ‌డం కాస్త మైన‌స్‌.

న‌టీన‌టుల పెర్సామెన్స్…

మూఢనమ్మకాలను నమ్మే యువకుడిగా ఫస్టాఫ్‌లో, తన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే యువకుడిగా, ప్రేమను గెలుచుకునే వ్యక్తిగా సెకండాఫ్‌లో శ్రీనివాస్‌ మంచి నటనను ప్రదర్శించాడు. పేద బ్రాహ్మణుడి పాత్రలో పోసాని చేత, ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కృష్ణ భగవాన్ చేత చేయించిన కామెడీ ఆద్యంతం రంజింపజేసింది. హీరోయిన్ పూర్ణ కూడా సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టి స్వయం కృషితో బ్రతకాలని అమ్మాయిగా మెప్పించింది. చాలా రోజుల తర్వాత రవివర్మ జె.సి పాత్రలో… పితా పాత్రలో జీవా, హీరోయిన్‌ పాత్రలో కృష్ణుడు, జోగి బ్రదర్స్‌ సహా మిగిలిన అందరూ ఆయా పాత్రల్లో చక్కగా నటించారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…

న‌గేష్ బానెల్ సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌గా ఉంది. కాకినాడ, భీమిలీ లొకేషన్లను అద్భుతంగా చూపించిన కెమెరా పనితనాన్ని మెచ్చుకోవలసిందే. ర‌విచంద్ర సంగీతంతో పాటు కార్తీక్ ఆర్ ఆర్ చ‌క్క‌గా సెట్ అయ్యింది. ఎడిట‌ర్ వెంక‌ట్ ఫ‌స్టాఫ్‌, సెకండాఫ్‌లో కొన్ని సాగ‌దీత సీన్ల‌కు క‌త్తెర వేయాల్సింది. సినిమా ర‌న్ టైంను ఓ 10 నిమిషాల పాటు ట్రిమ్ చేస్తే సినిమా ఇంకా బాగుండేది. స‌ర్వ‌మంగ‌ళం క్యారెక్ట‌ర్‌లో శ్రీనివాస్‌రెడ్డికి, పోసాని, కృష్ణ భ‌గ‌వాన్ పాత్ర‌ల‌కు రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. స‌తీష్ క‌నుమూరితో పాటు డైరెక్ట‌ర్ శివ‌రాజ్ క‌నుమూరి డైరెక్ట‌ర్ కం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సినిమా నిర్మాణ విలువ‌లు కూడా సినిమాకు త‌గిన విధంగా వంక లేని విధంగా ఉన్నాయి.

శివ‌రాజ్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:

ఓ న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని, ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు కథను, దానికి తగినంత కామెడీని కలుపుకుని కథనం రాసుకున్న దర్శకుడి రచనా ప్రతిభకు నిద‌ర్శ‌నం. ఫస్టాఫ్ లో, సెకండాఫ్ లలో కథనం కాస్త నెమ్మదించినా దాన్ని తెరక్కించిన ఆయన దర్శకత్వ తీరు బాగున్నాయి. చాలా సన్నివేశాల్లో డైరెక్టర్ ప్రతిభ, సునిశిత పరిశీలన క్లీయ‌ర్‌గా క‌న‌ప‌డింది. అయితే సెకండాఫ్‌లో క‌థ‌నం అక్క‌డ‌క్క‌డా దారి త‌ప్పింది. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు కూడా ప‌డ్డాయి. ఇక సినిమాలో మైన‌స్‌లు వెత‌క‌డం కంటే తెలుగు సినిమా ట్రెండ్ మ‌ళ్లీ పాత రోజుల్లోకి వెళ్లి ఇప్పుడు మ‌ళ్లీ ఫ్రెష్‌గా ముందుకు వ‌చ్చిన‌ట్లు ఉంది. 1980వ ద‌శ‌కంలో వ‌చ్చిన జాన‌ర్‌ను ఇప్పుడు మ‌ళ్లీ ఫ్రెష్‌గా చెప్పిన తీరుకు ఫిదా అవ్వాల్సిందే.

ఫైన‌ల్‌గా….
పున్న‌మి వెన్నెల్లో గోదావ‌రిలో ఫ్యామిలీతో స‌హా ఎంజాయ్ చేసిన‌ట్టు ఉండే సినిమా

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *