జేసీ అరెస్ట్…ఆంధ్రా-తెలంగాణ విమర్శలు

టీడీపీలో ఉన్న సీనియర్ నేతలైన జేసీ బ్రదర్స్ ఏం చేసినా సంచలనమే. జేసీ బ్రదర్స్ లో జూనియర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా హైదరాబాద్ లో కలకలం సృష్టించారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్- జేసీ బ్రదర్స్ మధ్య జరుగుతున్న ప్రైవేటు బస్సుల నిబంధనల ఉల్లంఘన – అక్రమ పర్మిట్ల ఎపిసోడ్ లో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వివరణ ఇచ్చేందుకు  హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసు వచ్చారు. అయితే ఈ సమయంలో జేసీని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తను అనుమతి పత్రాలు చూపించేందుకు వస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అయినప్పటికీ తనను అరెస్టు చేసిన పోలీసులు అదే రీతిలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విషయంలో ఎందుకు వ్యవహరించలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రావాడిని కాబట్టే తనను అరెస్టు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు నడపడం తమకు ఫ్యాషన్ అని తెలిపారు. తన తండ్రి సైతం ఇదే వ్యాపారంలో ఉండేవారని తెలిపారు. తాము నిబంధనల ప్రకారమే బస్సులు నడుపుతున్నామని తెలిపిన ప్రభాకర్ రెడ్డి కొందరు ప్రైవేటు ఆపరేటర్ల కోసమే శ్రీనివాస్ గౌడ్ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ పరిణామంపై శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ప్రైవేటు ట్రావెల్స్ అక్రమంగా తిరగడం వల్ల తెలంగాణ ఆర్టీసీకి నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. తాము దివాకర్ ట్రావెల్స్ విషయాన్ని కూడా ప్రస్తావించలేదని పలు ట్రావెల్స్ గురించి మాట్లాడితే ఆయనొక్కరే స్పందించారని వ్యాఖ్యానించారు. జేసీ బ్రదర్స్ తో పాటు ఈ వ్యాపారంలో 20-30 మంది ఉన్నారని వాళ్లలో ఎవరు తప్పు చేసినా శిక్షించాలని శ్రీనివాస్  గౌడ్ కోరారు. రాజకీయ నాయకులు.. గూండాల్లా వ్యవహరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఎవరికీ భయపడి బతికేవాళ్లం కాదని ఆరోపణ చేసినప్పుడు దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకుందని అందుకే అన్ని ఆధారాలతో వచ్చామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అక్రమంగా బస్సులు నడపడమే కాకుండా..జేసీ ప్రభాకర్ రెడ్డి  తమ మీద ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలెం బస్సు దుర్ఘటనలో కూడా ఆయనదే నేరమని ఆరోపించారు. బస్సు తనది కాదని చెప్పడానికి పాత తేదీతో అమ్మినట్లు కూడా పత్రం ఉందని డిసెంబర్ నెలలో స్టాంప్ పేపర్ కొని అక్టోబర్లో సంతకం చేసినట్లు చూపించారని తెలిపారు. అలాగే తక్కువ సీట్లకు పర్మిట్ తీసుకుని ఎక్కువ సీట్లతో నడిపిస్తున్నారని చెప్పారు. తనమీద ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *