పాక్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన.. 151 మంది సజీవదహనం

భారీ ఆయిల్‌ ట్యాంకర్‌ అది! రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. అందులోని 50వేల లీటర్ల పెట్రోల్‌ ధారగా కారిపోతోంది. చూస్తుండగానే ఆ రోడ్డంతా జనంతో నిండిపోయింది. బాటిళ్లు, క్యాన్లతో చీమలబారుల్లా వచ్చిపడుతూనే ఉన్నారు. పెట్రోల్‌ సముద్రంలో పడి దొరికినంతమేర ఎత్తుకుపోయే తొందరలో ఉన్నారంతా! ఇంతలోనే ప్రమాదం తోసుకొచ్చింది. ఎటునుంచో నిప్పు పడి పెట్రోల్‌ భగ్గుమనడం, ట్యాంకర్‌ పేలిపోవడం రెప్పపాటులో జరిగిపోయాయి. చూస్తుండగానే 150 మంది బుగ్గి అయిపోయారు. తెల్లారితే రంజాన్‌ పర్వదినమనగా ఆదివారం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ని విషాదం కమ్మేసింది. మృతుల్లో చిన్నపిల్లలు, మహిళలే ఎక్కువగా ఉండటం కలిచివేస్తోంది. కుటుంబసభ్యులు, సహచరులు సైతం గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు బుగ్గి అయిపోయాయి. ఘటనాస్థలిలోనే 123 మంది మృత్యువాతపడగా, 90 శాతం కాలిన గాయాలతో మరో 28 మంది ఆస్పత్రిలో మరణించారు. చికిత్స పొందుతున్న దాదాపు 120 మందిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. కరాచీలో పెట్రోల్‌ నింపుకొని లాహోర్‌ వైపుగా వెళుతున్న క్రమంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. అహ్మద్‌పూర్‌ షర్ఖీయాలోని బహవల్‌పూర్‌ గ్రామం గుండా జాతీయ రహదారిపై వెళుతుండగా, ఆయిల్‌ ట్యాంకర్‌ టైరు పంక్చర్‌ కావడంతో అదుపు తప్పి బోల్తాకొట్టింది. ట్యాంకర్‌లోని పెట్రోల్‌ ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మింది. వేలలీటర్ల పెట్రోల్‌ కారిపోవడం మొదలయింది. చూస్తుండగానే హైవే అంతా పెట్రోల్‌ సముద్రంగా మారిపోయింది. విషయం చుట్టుపక్కల గ్రామాలవారికి చేరిపోయింది. వెంట తెచ్చుకొన్న క్యాన్లు, టిన్లు, బాటిళ్లతో మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పెట్రోల్‌ నింపుకొంటున్నారు. ఇంతలోనే.. భూమి బద్దలయిందా అన్నట్టు, అతిభారీ పేలుడు శబ్దమూ, ఆ వెంటనే ఆకాశమంతా దట్టంగా అలుముకొన్న కారుమేఘాలు, మంటలను చీల్చుకొంటూ.. హాహాకారాలూ మిన్నుముట్టాయి. కాగా, పెట్రోల్‌ని తరలించుకోవాలన్న తమ దురాశే అనర్థానికి కారణమని క్షతగాత్రుడు హనీఫ్‌ వాపోయాడు.
చితి పెట్టిన సిగరెట్‌
రోడ్డుపై కారిపోతున్న పెట్రోల్‌ని చకచకా ఇళ్లకు తరలించుకుపోయే పనిలో అంతా మునిగిపోయారు. నింపిన డబ్బాలను మోసుకుపోయే వాహనాలతో, ఖాళీ క్యాన్లతో తిరిగివస్తున్న బైకులతో హైవే కిక్కిరిసిపోయింది. కొంతమంది క్యాన్లను నింపుకొంటుండగా, తమ వంతు వచ్చేదాకా, ట్యాంకర్‌ని ఆనుకొని కొందరు, చక్రాల మీద ఎక్కి ఇంకొందరు.. ఇలా దాదాపు అందరూ చుట్టూ గుమిగూడారు. రద్దీ పెరిగిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హైవేపై గుంపులుగుంపులగా చేరిన జనాలను..అక్కడినుంచి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో, జనంలో ఒకరు సిగరేట్‌ వెలిగించాడు. అంతవరకే తాము చూడగలిగామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్యాంకరు బద్దలయిపోవడంతో ఆ చుట్టుపక్కల ఉన్నవారంతా నెత్తుటిముద్దల్లా గాలిలోకి లేచి, దూరంగా వెళ్లిపడ్డారు. ఆయిల్‌ ట్యాంకరు పేలడం ఒక ఎత్తయితే, సమీపంలోనే పెద్దఎత్తున వాహనాలు నిలిపి ఉంచడం.. బీభత్స తీవ్రతని బాగా పెంచినట్టు అధికారులు తెలిపారు. ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా ఆదేశాలతో సైనిక బలగాలు.. ఘటనాస్థలికి చేరుకొన్నాయి.
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *