నువ్వంటే ప్రేమ.. ఆగ్రహం.. నానికి ఓ ‘కత్తి’అభిమాని లేఖ

తమకు నచ్చిన హీరో సినిమా హిట్ అయితే సంతోషపడటం, ఫ్లాఫ్ అయితే బాధపడటం సినీ అభిమానులకు సర్వసాధారణం. ఇదంతా ఎందుకు చెప్పడమంటే. తెలుగు సినీ పరిశ్రమలో నానికి విలక్షణ నటుడు అనే పేరుంది. ఆయన నటన సహజంగా ఉంటుంది ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. అందుకు ఈగ, భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ, జంటిల్మన్ లాంటి చిత్రాలు నాని ప్రతిభకు అద్దంపట్టాయి. తాజాగా నేను లోకల్ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకోవడం కోసం సిద్ధపడ్డాడు. అయితే ఈ చిత్రం నాని గత చిత్రాలకు భిన్నంగా.. ఆయన, ప్రేక్షకుల టేస్ట్‌కు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో చిత్రాల ఎంపికపై నాని జాగ్రత్తగా ఉండాలని, కాస్తా శ్రద్ధ పెట్టాలని సోషల్ మీడియాలో సినీ విశ్లేషకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేశ్ స్పందించారు. ఆ స్పందన ఆయన రాతల్లోనే..

ప్రియమైన నానికి,

నీకు తెలుసో లేదో…నువ్వు తెలుగు సినిమాకి ప్రమాదవశాత్తు పట్టిన అదృష్టానివి. వంశాల గోలలు. ఫ్యూడల్ ఈలల మధ్య, త్రిశంకు స్వర్గంలో అటూఇటూ కాకుండా, అర్థనారీశ్వర తత్వంలో మిగిలిపోయిన తెలుగు హీరో వీరోచిత నపుంసకత్వపు సెగల మధ్య, మాడి శలభాలవుతున్న ప్రేక్షకులకి నవనీతాన్ని అద్దిన వైద్యుడివి. నీలోని అమాయకత్వం. అసాధారణ సాధారణత్వం. నిష్కల్మష నటనా వైదుష్యం. సహజంగానే నిన్ను సహజ నటుడిని చేస్తే. ఆ సహజాతపు పరిమళాల్ని సినిమా సినిమాకూ విస్తరిస్తూ. పాత్రల్ని, పాత్ర తీరుల్ని. కథల్ని కథానరీతుల్ని. రచయితలని, దర్శకులని అలుముకుని. అదుముకుంది. ప్రేక్షకులందరు ఆఘ్రాణించే అమర కుసుమాలుగా సినిమాల్ని మార్చిన సౌగంధికా పుష్పానివి నువ్వు.

mahesh
mahesh
అలాంటిది…ఎందుకు నీకు ఈ అశుద్ధం!

వేధించి వేగించి ప్రేమించే శాడిజాన్ని హీరోయిజం చేసే కథలెందుకు. బాధ్యతా రాహిత్యాన్ని గ్లామరైజ్ చేస్తూ.అసందర్భంగా సిగరెట్ కాలుస్తూ. అనవసరంగా స్లోమోషన్ లో సాగిపోవడమే మాస్ ఇమేజ్ అనుకునే భ్రమలెందుకు.

సమకాలీన సినిమాలో అంతర్జాతీయ నటుడివి

కాంటెంపరరి తెలుగు సినిమాలో నువ్వు ఏకైక అంతర్జాతీయ స్థాయి నటుడివి. నీకు ఈ దిగజారుడుతనం సరికాదు. నువ్వొక యంగ్ అమీర్ ఖాన్ వి. నీకు ఈ చపలత్వం శోభనివ్వదు. ఎన్నో ఇన్నోవేటివ్ క్రియేటివ్ ఆలోచనలు, అద్వితీయ కథలుగా నీ ద్వారా అందాలని ఆశిస్తుంటే, ఈ నేలబారు ఛాయ్స్ లు ఏమిటి. ఎందరో నవయువ దర్శకుల విజన్ కి నువ్వు వెహికిల్ అవుతావని ఆశపడితే, ఈ చౌకబారు సినిమా ఏమిటి.

నువ్వంటే నాకు ప్రేమ. అందుకే ఈ ఆగ్రహం

నువ్వంటే నాకు ప్రేమ. అందుకే ఈ ఆగ్రహం కూడా. నెత్తికెత్తికుని ఊరేగే నేనే నువ్వు నేలపై పాకుతానంటే ఒప్పుకొను. అందుకే అధికారంగా. అనునయంగా. ఆప్యాయంగా రాస్తున్నా.. నువ్వు నాకు. మాకు. కావాలి. ఇలా కాదు. ఉన్నతంగా కావాలి. మహోన్నతంగా నువ్వు వెలగాలి. – ఇట్లు ప్రేమతో కత్తి మహేష్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *