కేసీఆర్ మార్కులు.. కేబినెట్లో మార్పులు

తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్లోని మంత్రులు – పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించడం.. వారికి మార్కులివ్వడం.. ఆ ప్రాగ్రెస్ రిపోర్టులు వారి చేతికే ఇచ్చి క్లాసులు పీకడం తెలిసిందే. టీఆరెస్ నేతల్లో ఈ పరిణామం గుబులు పుట్టిస్తోందట. దీని వెనుక ఉన్న రీజన్లపై నేతలు అంచనాలు వేసుకుంటున్నారట. కేబినెట్లో మార్పులకు ఇది సంకేతం అని… దీని ఆధారంగా కొందరి మంత్రి పదవులు ఊడుతాయని.. మరికొందరికి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు… 2019 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ మరమ్మతులు చేపట్టడంలో భాగంగానే నేతలను దారిలో పెట్టేందుకు కేసీఆర్ సర్వే అస్త్రం బయటకు తీసినట్లు భావిస్తున్నారు.

కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనుక పెద్ద ప్లానే ఉంటుంది.  నిన్న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా సర్వే చర్చే చేసుకోవడం కనిపించింది. నీకెన్ని మార్కులు.. నీకెన్ని మార్కులు అంటూ తెలుసుకోవడం కనిపించింది. ఇక మంత్రుల్లో అయితే ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. స్కోరు తగ్గిన మంత్రులు ముఖ్యమంత్రి సర్వే వెనుక ఆంతర్యం అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. సిఎం సర్వేలో కేవలం ముగ్గురు మంత్రులు మాత్రమే సామర్ధ్యాన్ని పెంచుకున్న వారిలో ఉండగా మరో ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. మిగతా 11మంది సామర్ధ్యం ఆరు మాసాల్లో గణనీయంగా పడిపోయినట్లు తేలింది. దీంతో ఇప్పుడు వారిని ఏం చేస్తారన్నది చర్చనీయంగా మారింది.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతోంది.. ఇంతవరకు కేబినెట్లో పెద్దగా మార్పుల్లేవు. మంత్రివర్గం నుండి ఒక్క రాజయ్యను మినహా ఎవరినీ తొలగించలేదు. మంత్రివర్గంలో ఇంకా అదనంగా ఎవరినీ తీసుకునే అవకాశం లేకపోవడంతో ఆశావహులకు హామీలు ఇచ్చిన వారికి ఛాన్స్ ఇవ్వాలంటే ఉన్న వారికి కోతపెట్టడం అనివార్యం. ఈ క్రమంలో పెర్ఫార్మెన్స్ రిపోర్ట్లను బయటకు తీశారనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా వేటు ఖాయం అంటూ ప్రచారం జరుగుతున్న మంత్రులే సిఎం సర్వేలో అట్టడుగున ఉండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.  భూపాలపల్లి జిల్లాకు చెందిన ఆజ్మీరా చందూలాల్ – ఆదిలాబాద్ కు చెందిన జోగు రామన్న రంగారెడ్డికి చెందిన మహేందర్ రెడ్డి నల్లగొండ మంత్రి జగదీష్ రెడ్డిలు సిఎం సర్వేలో వెనుకబడ్డారు. వీరిలో జోగురామన్న – చందూలాల్ ల పేర్లు చాలా కాలంగా తొలగింపు జాబితాలో ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లి సమావేశాల తర్వాత కేబినెట్ మార్పుచేర్పులు ఖాయమని అనుకుంటున్నారు.

అయితే మంత్రుల గ్రాఫ్ తగ్గిస్తూ వెల్లడించిన ఫలితాలు వారిపై ఒత్తిడి పెంచి.. పరుగెత్తించడానికేనన్న వాదనా వినిపిస్తోంది.  మంత్రులు బద్దకం వదిలించుకుని గట్టిగా పనిచేస్తే ఆ ప్రభావం జిల్లా మొత్తంపై ఉంటుందని అందుకే మంత్రుల గ్రాఫ్ తగ్గిన ఫలితాలను సిఎం విడుదల చేశారంటున్నారు. గత కొంతకాలంగా చాలా మంది మంత్రులు విపక్షాల విమర్శలను దాడిని పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ కేబినెట్ సమావేశాల సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా పనితీరులో ఆశించిన మార్పు రాకపోవడంతో.. ప్రోగ్రెస్ రిపోర్ట్ అస్త్రం బయటికి తీసినట్లు వాదనలు ఉన్నాయి.  పనితీరును సమీక్షించుకుని మెరుగుపరుచుకునేందుకే ప్రోగ్రెస్ రిపోర్ట్ అందిస్తున్నానని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెప్పినా సిట్టింగ్ లకు సీట్లపై నో డౌట్ అంటూ అభయమిచ్చినా.. ఎమ్మెల్యేల్లో మాత్రం భయాందోళనలు ఉన్నాయి. గ్రాఫ్ పడిపోయిన ఎమ్మెల్యేలతో పాటు గత సర్వేకు ఇప్పటి సర్వేకు మార్కులు తగ్గిన ఎమ్మెల్యేలలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యమంత్రి వ్యూహం కూడా ఇదేనని ఈ సర్వేలు ఇప్పటితో ఆగవని.. పనితీరు మెరుగుపరుచుకుని ప్రజల్లో ఉన్న వారికే టిక్కెట్లు లభిస్తాయని పలువురు విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం నిలుపుకోవ డమే లక్ష్యంగా కేసీఆర్ ఇప్పటినుంచే మరమ్మతులు మొదలుపెట్టారని తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *