అలా జరిగితే ఐదు నిమిషాల్లో కేసీఆర్ రాజీనామా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. గవర్నర్ మాట్లాడే కాసేపు కూడా అసహన వైఖరిని అణచిపెట్టుకోలేరా? అని కేసీఆర్ సూటిగా నిలదీశారు. గత సభలో కూడా టీడీపీ సభ్యుడు గవర్నర్ వస్తుంటే అవహేళన చేశారని గుర్తు చేశారు. సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తూ హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షం చర్చలో పాల్గొనే అవకాశం ఉండి కూడా పాల్గొనకపోవడం విచారకరమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ హుందాతనానికి భంగం కలగనివ్వమని స్పష్టం చేశారు. అరుపులు పెడబొబ్బల కోసం సభ ఉండదని ఇలాంటి విషయాల్లో కఠినంగానే వ్యవహరిస్తామని కేసీఆర్  తేల్చిచెప్పారు. సభను అపహాస్యం చేస్తే సహించేది లేదని ముగ్గురు ఎమ్మెల్యేలున్న పార్టీ చెప్పినట్టు సభ నడవదని టీడీపీని ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాలు అతి చేస్తాయని మండిపడ్డారు. ఎన్ని రోజులైనా సభ నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని  ఏ అంశాన్ని ప్రస్తావంచినా సమాధానం చెప్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై  ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వెలిబుచ్చారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎన్ని కుటుంబాలకు ఎన్ని ఉద్యోగాలను ఇచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే లక్ష వరకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పామని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీరుతామని ఉద్ఘాటించారు. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలుంటే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తానని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదన్నారు.  రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏ పని చేయొద్దా? అని కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు.

శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ అవినీతి చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని యావత్ దేశం అంటుందని తెలిపారు. పొద్దున లేస్తే మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మీద నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. గెలిచిన ప్రభుత్వం ఏ పని చేయొద్దా? అని ప్రశ్నించారు. ఇదేనా ప్రతిపక్షం వ్యవహరించే తీరు అని అడిగారు. ఆరోపణలు చేయడం తప్పుకాదు.. రుజువు చేయాలని డిమాండ్ చేశారు.  నిజాయితీగా పారదర్శకంగా రాజకీయ అవినీతికి తావు లేకుండా పని చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఇక నుంచి నిరాధర ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షాలు ఒక్క ఆరోపణనైనా రుజువు చేశాయా? అని ప్రశ్నించారు. వోక్స్వ్యాగన్ పేరిట ప్రభుత్వ సొమ్ము ఎవరికో ఇచ్చిన చరిత్ర మీది అని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

పాలకుల తరఫున ఒక్క చిన్న తప్పు జరిగినా రాబోయే తరాలమీద ప్రభావం పడుతుందని  సీఎం కేసీఆర్ వస్తదన్నారు.  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలన్నారు. తెలంగాణకు రోజు 600 లారీల గొర్రెలను పక్క రాష్ర్టాల నుంచి తెస్తున్నారని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో 30 లక్షల మంది యాదవులున్నారని 4 లక్షల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లను ఇస్తామన్నారు. రెండేళ్లలో 88 లక్షల గొర్రెలను అందజేస్తామన్నారు. అక్రమాలకు తావు లేకుండా పక్క రాష్ర్టాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రెండేళ్లలో ఈ గొర్రెల సంఖ్య 4 కోట్లకు చేరుతుందన్నారు. ఒక్కో గొర్రె రూ. 5 వేల చొప్పున లెక్కేసినా రూ. 20 వేల కోట్ల విలువ చేసే గొర్రెలు మన రాష్ట్రంలో ఉంటాయని చెప్పారు. తెలంగాణ యాదవులకు దేశంలోనే ధనికులుగా మారుస్తామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వాల హయాంలో ఉన్న విద్యుత్ దుస్థితి పోయిందని కేసీఆర్ తెలిపారు. గతంలో పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన దుస్థితి ఉండేందని ఉమ్మడి రాష్ట్రంలో సభకు లాంతర్లు ఎండిపోయిన కంకులు తీసుకువచ్చిన దృశ్యాలు చూశామని తెలిపారు. కరెంట్ కోతల విషయంలో రాజీవ్ రహదారి బంద్ కు పిలుపునిచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ విషయంలో అద్భుతాలు చేశామని వందశాతం విద్యుత్ కోతలు లేకుండా చేయగలిగమన్నారు. విద్యుత్ ఉద్యోగులకు చేతులు జోడించి సలాం చేస్తున్నానని కసీఆర్ చెప్పారు. 10 వేల మెగవాట్లు ఇచ్చేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వార్ధా మహేశ్వరం విద్యుత్ లైన్ పూర్తయిందన్నారు. దేశంలో ఎక్కడి నుంచైనా మనం కరెంట్ తీసుకోవచ్చని పేర్కొన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *