సీఎం దత్తత గ్రామాల్లో పండుగ శోభ..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో పండుగ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ చ చేతుల మీదుగా నేడు ఇరు గ్రామాల్లో 600 డబుల్ బెడ్‌రూం ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి. ఉదయం ఎర్రవల్లి చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. సామాజిక భవనాన్ని ప్రారంభించి.. అక్కడ నిర్వహించిన వాస్తు హోమంలో పాల్గొన్నారు. ఎర్రవల్లిలో ఫంక్షన్‌ హాల్‌ను ప్రారంభించిన కేసీఆర్….కళ్యాణమండపంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఇరు గ్రామాల్లోని ప్రజలంతా ఒకేసారి గృహప్రవేశం చేశారు. ఒక్కో ఇంట్లో ఒక్కో బ్రహ్మణుడిచే వాస్తుపూజ, పూణ్యాహవచనం, సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. సుమూహుర్తం 7.53 గంటలకు వేద మంత్రోచ్చారణ నడుమ గ్రామస్తులు గృహప్రవేశం చేశారు.ఎర్రవల్లిలో 330 ఇళ్లు, నర్సన్నపేటలో 159 ఇళ్లకు సామూహిక గృహప్రవేశం జరిగింది.

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు నగదు రహిత గ్రామాలుగా ప్రకటించిన సీఎం… రెండు గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు..సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌ స్ఫూర్తిగా ఇకపై ఈ రెండు గ్రామాలు నగదు రహిత లావాదేవీలకు నమూనాగా మారాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచేలా అందరూ కృషి చేయాలన్నారు. త్వరలో సామూహిక భోజనాలు ఏర్పాటుచేసుకుందామని తెలిపారు.

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదు రహిత లావాదేవీలు నిర్వహించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రెండు గ్రామాల్లోనూ 1200 మందికి ఇప్పటికే డెబిట్‌ కార్డులు అందించామన్నారు. మొత్తం 17 స్వైపింగ్‌ యంత్రాల సాయంతో నగదు లేకుండానే కొనుగోళ్లు జరిగేలా ఏర్పాటు చేశామన్నారు.

గతేడాది విజయదశమి రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండు గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన ప్రత్యేక దృష్టి సారించడంతో కేవలం 14 నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అన్ని హంగులతో సకల సౌకర్యాలతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *