‘సీఎం’ కేసీఆర్ కొత్తింటి గృహప్రవేశం పూర్తైంది

పేరుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసం అన్న మాటే కానీ.. దానికి సంబంధించిన ప్రతి అంగుళం.. ముఖ్యమంత్రి ఆలోచనలకు.. అభిరుచికి తగ్గట్లుగా నిర్మించారు. స్వల్ప వ్యవధిలో భారీ నిర్మాణాన్ని పూర్తి చేయటమే కాదు.. కోట్లాది రూపాయిల్ని ఖర్చు చేశారు. దాదాపు రూ.40 కోట్ల వరకూ సీఎం కొత్త అధికార నివాసం కోసం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

పండితులు నిర్ణయించిన విధంగానే ఈ రోజు (గురువారం) ఉదయం 5.22 గంటల సమయంలో కేసీఆర్ కొత్తింటి గృహప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు.. వ్యక్తిగతంగా నమ్మిక ఉన్న చినజీయర్ స్వామి చేతులు మీదుగా గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినహా.. ఉప ముఖ్యమంత్రి.. మంత్రులు హాజరు కాలేదని తెలుస్తోంది.

సంప్రదాయ బద్ధంగా గృహప్రవేశ కార్యక్రమం పూర్తి అయింది. కేసీఆర్ కుటుంబ సభ్యులు.. బంధువర్గం.. సన్నిహితులు.. స్నేహితులు ఈ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐదు భవనాల సముదాయానికి ‘ప్రగతి భవన్’ అని.. సమావేశ మందిరానికి ‘జనహిత’అన్న పేర్లను పెట్టారు. మొత్తం తొమ్మిది ఎకరాల స్థలంలో తొమ్మిది నెలల వ్యవధిలోనే.. తెలంగాణ సీఎం అధికారిక నివాసాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అందుబాటులో ఉన్న సీఎం అధికారిక నివాసంలో సౌకర్యాల లేమి అని చెబుతున్నప్పటికీ.. వాస్తు మీద ముఖ్యమంత్రికి ఉన్న అసంతృప్తితోనే ఈ కొత్తింటిని నిర్మించినట్లుగా చెబుతారు. వెయ్యి మందితో ఒకేసారి సమావేశాన్ని నిర్వహించుకునేలా కొత్త ఇంట్లో ఏర్పాట్లు చేశారు.

గృహప్రవేశం సందర్భంగా ఇంటిలోని ప్రతి గదిని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన సతీమణి దగ్గరుండి చినజీయర్ స్వామికి చూపించటంతో పాటు.. ఆయన నేతృత్వంలో పండితులు పూజలు నిర్వహించారు. మొత్తమ్మీదా కేసీఆర్ కలల ఇల్లు అయితే కొత్తింట్లోకి ఈ రోజే మారిపోతారని.. వెనువెంటనే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *