కేసీఆర్ లోని పుడ్ లవ్వర్ బయటకొచ్చారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారికిది కొత్త విషయం కాకున్నా.. ఆయన గురించి ఓమోస్తరుగా తెలిసిన వారికి కూడా ఇదికొత్త విషయమే. చూసేందుకు బక్కపల్చగా ఉండే కేసీఆర్ మంచి పుడ్ లవ్వర్ గా చెప్పాలి. తనకు ఇష్టమైన వారు కలిసినా.. తనకు అత్యంత ముఖ్యులనిపించినా ఆయన మరో ఆలోచన లేకుండా లంచ్ కు ఆహ్వానిస్తుంటారు. గ్రామాల్లో ఏర్పాటు చేసే సభల్లో మాట్లాడే సందర్భంలోనూ ఆయన.. తరచూ అందరం కలిసి భోజనాలు చేస్తామని చెబుతుంటారు.

భోజనం చేద్దామన్నంతనే కేసీఆర్ ను ఫుడ్ లవ్వర్ కోటాలో వేయలేం. ఆయన స్వతహాగానే ఫుడ్ లవ్వర్ గా ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతారు. సమకాలీన రాజకీయాల్లో కాస్తంత తిండి పుష్టి ఉన్న కొద్దిమంది అధినేతల్లో ఆయన ఒకరుగా చెబుతుంటారు. తానెంత ఫుడ్ లవ్వర్ ని అన్న విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తన మాటలతో చెప్పకనే చెప్పేశారు.

ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మత్స్య పరిశ్రమ ధ్వంసమైందని..ప్రస్తుతానికి రూ.500 కోట్లు కూడా సంపాదించి పెట్టని మత్స్య రంగాన్ని రూ.5వేలకోట్ల స్థాయికి తీసుకెళ్లేలా చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఇందులో భాగంగా మత్స్య శాఖలో దాదాపు 600 మందివరకూ కొత్త సిబ్బందిని తీసుకోనున్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు.

మంగళవారం అసెంబ్లీలో మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మత్స్య పరిశ్రమను తెలంగాణలో ఎలా వృద్ధిచేస్తామన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ఆ పరిశ్రమ అభివృద్ధికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వివరంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మత్స్య సంపదతో చేసే వంటకాల గురించి కేసీఆర్ చెప్పినతీరు సభ్యుల మోములో నవ్వులు పూయించింది. ఈసందర్భంగా తన చిన్ననాటి ముచ్చట్లను ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

తెలంగాణలోని మత్స్య సంపద.. వాటితో చేసే వంటకాలు.. వాటి రుచి గురించి చెప్పటంతోపాటు. మత్స్య సంపదను భారీగా పెంచేందుకు ఉన్నఅవకాశాల్ని కేసీఆర్ మాటల్లోనే యథాతథంగా చూస్తే..

‘‘సహజంగా చెరువుల్లో పెరిగే ఎర్ర రొయ్యలు నా చిన్నతనంలో విరివిగా దొరికేవి. చింతచిగురు – శనగపప్పు వేసి వండితే వాటి రుచి అద్భుతం. ఇప్పుడు వాటిజాడే లేదు. మళ్లీ చెరువులకు పూర్వవైభవం వస్తే అవి విరివిగా దొరుకుతవి. మల్లన్న సాగర్ ను భారీ విస్తీర్ణంలో నిర్మించాలనే యోచనకు కూడా ఇలాంటి కారణాలే మూలం’’

‘‘నేను దుబ్బాక జిల్లా పరిషత్ పాఠశాలలో చదివేప్పుడు వైజ్ఞానిక పర్యటన కోసం అప్పర్ మానేరు డ్యాం వద్దకు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టు చేప పిల్లల ఉత్పత్తికేంద్రమని మా ఉపాధ్యాయులు చెప్పటం నాకింకా గుర్తు. అప్పట్లో తెలంగాణలో అలా ఎన్నో కేంద్రాలుండేవి. ఇప్పుడు జీరో..’’

‘‘దేవాదుల దిగువన ఉన్న కొత్తూరు నుంచి ధర్మపురి చేరువలోని జైన వరకుదాదాపు 140 కిలోమీటర్ల వరకు గోదావరి గలగలలను చూడబోతున్నాం.రోహిణి కార్తె వస్తే మొగులుకు ముఖంపెట్టి చూసే రోజులుపోయి సాగు – తాగునీటికే కాకుండా అద్భుత మత్స్య పరిశ్రమకు ఆలవాలం కానుంది. ఆ చిత్రం ఊహించుకుంటేనే కడుపు నిండుతోంది. నిజంగా అది ఆవిష్కృతమైనప్పుడు తెలంగాణ రూపురేఖలే మారిపోతాయి. నేను కలలుగంటున్న ఆ దృశ్యం చూసేవరకు బతికుండాలని దేవున్ని కోరుకుంటున్నా’’

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *