కేసీఆర్ మోడీని ఫుల్లుగా మోసేస్తున్నారు!

“మోడీ ఊరికే ఏ పనీ చేయరు.. ఆయన ఎంతో ఆలోచించి పెద్ద నోట్లను రద్దు చేశారు.. ఆయన ప్లాన్లు ఆయనకు ఉన్నాయి.. కచ్చితంగా దేశానికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను” ఇది ఒక ముఖ్యమంత్రి మాట. ఆయనేమీ బీజేపీ సీఎం కారు.. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు మోడీ లేదు గీడీ లేదు అంటూ తీసిపడేసిన నేత. ఆయనెవరో కాదు తెలంగాణ సీఎం కేసీఆర్. మోడీ ఏం చెప్పారో ఏమో కానీ తొలుత పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మోడీకి ఫుల్ సపోర్టు ఇస్తున్నారు. అంతేకాదు.. దేశంలో ఇంకే సీఎం చేయనంతగా మోడీ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.

పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలపై తెలంగాణ శాసనసభ – మండలిలో చర్చ  జరిగిన సందర్భంగా కేసీఆర్ మోడీని ఆకాశానికెత్తేశారు.  గతంలో కాంగ్రెస్ కూడా పెద్దనోట్ల రద్దు చేయాలని భావించిందని కానీ చేయలేకపోయిదని ఇప్పుడు ప్రధానమంత్రి  నరేంద్ర  మోదీ ఆ సాహసం చేశారని అన్నారు. పెద్దనోట్ల రద్దు అసాధారణ నిర్ణయమని ఈ నిర్ణయాన్ని మనం స్వాగతించాలని కోరారు.

ప్రధాని మోదీ ఇక్కడితో ఆగబోరని – నల్లధనం ఏ రూపంలో ఉన్న బయటకు రావాల్సిందేనని మోదీ మరిన్ని చర్యలు తీసుకుంటారని కేసీఆర్ చెప్పారు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా రాబట్టాల్సిందేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి 50 రోజులు సమయం ఇవ్వమని ప్రధానమంత్రే చెప్పారని ఇంకా 50 రోజులు కాలేదని వేచి చూద్దామని కేసీఆర్ అన్నారు. సిద్ధిపేటను నగదురహిత ప్రాంతంగా మారుస్తున్నామని చెప్పారు. 100 శాతం క్యాష్లెస్ అంటే అది సాధ్యం కాదని సాధ్యమైనంత వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరపాలని అన్నారు.

మొత్తానికి కేసీఆర్ మాత్రం మోడీని ఫుల్లుగా మోసేస్తున్నారు. ఢిల్లీకి పిలిచి మాట్లాడినప్పుడు ఏం చెప్పారో.. హైదరాబాద్ కు వచ్చినప్పుడు విమానాశ్రయంలో భుజం మీద చేయి వేసి తీసుకెళ్లినప్పుడు ఏం మంత్రం వేశారో కానీ కేసీఆర్ మాత్రం మోడీ డీమోనిటైజేషన్ కు పెద్ద ఫ్యాన్ గా మారిపోయారు. వసుంధరరాజె సింధియా – దేవేంద్ర ఫడ్నవీస్ – శివరాజ్ సింగ్ చౌహన్ – రమణ్ సింగ్ – శర్వానంద్ సోనోవాల్ – విజయ్ రూపానీ వంటి బీజేపీ ముఖ్యమంత్రులు కూడా మోడీని ఈ విషయంలో ఇంతగా మోయడం లేదు. కేసీఆర్ మాత్రం ఫుల్లుగా మోసేస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *