‘‘రద్దు’’ దిక్కుమాలిన నిర్ణయమంటున్న కేసీఆర్?

పెద్దనోట్ల రద్దుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై బయటకు ఓపెన్ గా మాట్లాడని ముఖ్యమంత్రి కేసీఆర్.. అంతర్గత సమావేశాల్లోనూ.. కీలక అధికారుల దగ్గరా.. పార్టీ నేతల వద్దా ఆయన మోడీ నిర్ణయంపై ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

మోడీ తీసుకున్న నిర్ణయంతో దేశం మరో 30 ఏళ్లు వెనక్కి వెళ్లనుందన్న మాట కేసీఆర్ నోట వచ్చిందని చెబుతున్నారు. నోట్లరద్దుపై తీసుకున్న నిర్ణయాన్ని దిక్కుమాటిన నిర్ణయంగా అభివర్ణిస్తున్న కేసీఆర్.. కేంద్రానిది ఏకపక్ష నిర్ణయమని.. ఇంత పెద్దనిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమంత్రులందరిని సమావేశ పరిచి.. అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం వెల్లడిస్తే బాగుండేదన్న భావనను ఆయన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇతర పార్టీ నేతలే కాదు.. బీజేపీ సీఎంలు పలువురు మోడీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. నోట్ల మార్పితో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. దీనిపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్న వ్యాఖ్యలు కేసీఆర్ చేసినట్లుగా తెలుస్తోంది. సరిగా కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం వేసుకున్న ఎన్నో ప్లాన్లు తలకిందులు అయినట్లగా కీలక అధికారులతో భేటీ సందర్భంగా కేసీఆర్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతి వ్యాపార రంగంపైనా నోట్ల రద్దు ప్రభావం పడిందని.. వ్యాపారాలన్నీ కుదేలు అయినట్లుగా ఆయన అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.

వివిధ రంగాల నిపుణులు.. శాఖల ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ఆయన.. సమగ్రనివేదికను రెఢీ చేయటంతో పాటు.. నోట్ల రద్దుపై చుట్టుపక్కల రాష్ట్రాల వారుఎలా రియాక్ట్ అవుతున్నారన్న విషయాన్ని కేసీఆర్ ఆరా తీసున్నట్లుగా చెబుతున్నారు. డబ్బుల కోసం బ్యాంకులు చుట్టూ తిరిగే పరిస్థితిని తీసుకొచ్చిన తీరుపై ప్రజలుకేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. దీన్ని ఊరుకోవద్దని.. వివిధ మార్గాల్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టింగ్ లను స్వయంగా చూసిన కేసీఆర్.. నోట్ల రద్దు దిక్కుమాలిన నిర్ణయంగా అభివర్ణించటంతో పాటు.. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని.. కుటుంబాలకు కుటుంబాలు బ్యాంకు ఏటీఎం దగ్గర నిలబడాల్సి వస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మోడీ నిర్ణయంపై కేసీఆర్ కోపంగా ఉన్నారన్న మాటకు బలం చేకూరేలా పలు వాదనలు బయటకు రావటం గమనార్హం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *