మొట్టమొదటి ముఖ్యమంత్రిని నేనే..

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, రాష్ట్రం విద్యుత్ గండం నుంచి గట్టెక్కిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనమండలిలో తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కరెంట్ విషయంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి 30 ఏండ్లు ప్రజలను ఏడిపించారని తెలిపారు. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ సభ్యుడు షబ్బీర్ అలీ నిజాలను ఒప్పుకోవాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించిందని తేల్చిచెప్పారు. ప్రతిపక్షాలు సభలో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితిని, విపక్షాల తీరును ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 9 వేల మెగావాట్లకు చేరిందన్నారు. 10 వేల మెగవాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యుత్ శాఖ ఉద్యోగులను అభినందించాల్సిన అవసరం ఉన్నది. రైతుల, ప్రజల 30 ఏండ్ల గోసను తాము తీర్చినప్పటికీ ప్రతిపక్షాలు ఒప్పుకోకపోవడం బాధాకరమన్నారు. విద్యుత్ మోటార్లను రిపేర్ చేసే షాపులన్నీ మూతపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం లేదన్నారు.

విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చాలా అంశాల్ల్లో రాష్ట్రం మెరుగైందన్నారు. విద్యుత్ కోతలు అధిగమించినా విషయాన్ని విపక్షాలు అంగీకరించడం లేదన్నారు. 31 జిల్లాల్లో విద్యుత్ వినియోగాన్ని తెలుసుకునేందుకు ఒక యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 4 గంటలు కరెంట్ కట్ చేస్తారంటూ వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 4 గంటలు కాదు కదా.. 4 సెకన్ల పాటు కూడా కరెంట్‌ను పోనివ్వమని స్పష్టం చేశారు.

అప్పు పొందే అవకాశం ఉండి.. అప్పు తేని ప్రభుత్వం సన్నాసి కిందే లెక్క అని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు తీసుకోవడంలో తప్పు లేదన్నారు. జీడీపీ ఎంత ఉందో అంత అప్పు తీసుకునే దేశం అమెరికా అని చేశారు. కేంద్రం అడుగుజాడల్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తాయని, 60 ఏళ్లలో తీసుకున్న అప్పు.. రెండేళ్లలో చేశారంటున్నారు. మీరు చేసిన 60 వేల కోట్ల అప్పు.. ఇప్పుడు 6 లక్షల కోట్లతో సమానమని చెప్పారు. ఈ ఏడాదిలో మనం రూ. 20 వేల కోట్ల అప్పు తిరిగి చెల్లించబోతున్నామని స్పష్టం చేశారు. తీసుకున్న అప్పులు అదే విధంగా చెల్లింపులు జరుగుతాయన్నారు. మిషన్ భగీరథ కోసం బ్యాంకుల కన్సార్టియం ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం పూర్తయితే మంచినీటి సమస్య రాదన్నారు. ఇక కొన్ని రాష్ర్టాల తప్పుడు విధానాల వల్ల వారి విద్యుత్ సంస్థలు దివాలా తీశాయని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు కేంద్రం ఉదయ్ పథకం తీసుకువచ్చిందన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ సంస్థలు అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రూ. 12 వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. కరెంట్ లేకుంటే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ బాండ్లు కొనేందుకు బ్యాంకులు క్యూ కట్టాయని తెలిపారు.

తెలంగాణ లో రియల్ ఎస్టేట్ బూమ్ బాగా ఉండి, ఆదాయం ఊపందుకున్న సమయంలో వెలువడ్డ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో తన కాళ్లు విరగ్గొట్టినట్టు అయిందని ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో తాము మొత్తం 31 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్న సమయంలో పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందన్నారు. ఆ ప్రకటన వెలువడిన అనంతరం ప్రధానితో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రిని తానేనని అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో తమ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై, తన కాళ్లు విరగ్గొట్టినట్టు అయిందని నాడు ప్రధాని మోదీకి చెప్పగా, ఈ విషయమై ప్రశ్నించిన ఆయనకు వివరించి చెప్పానని కేసీఆర్ అన్నారు. గుజరాత్ రాష్ట్రం కంటే కూడా తెలంగాణ ఎక్కువ వృద్ధి రేటుతో మంచి ఆదాయం సాధించినందుకు ప్రధాని తనను అభినందించారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందంటూ మోదీ తనను ప్రశంసించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *