ఈ వారంలో కేసీఆర్ ను ఆపే వారే లేరు తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఈ వారంలో అడ్డు చెప్పే వారే టీఆర్ ఎస్ పార్టీలో ప్రభుత్వంలో కానీ లేరని గులాబీ వర్గాలు చెప్తున్నాయి! అవునా? ఇన్నాళ్ల పాటు ఎవరైనా అభ్యంతరం తెలిపారా అంటే ఎవరూ తెలపలేదు. కానీ ఆయనే కాస్త వెనక్కు తగ్గారు. కాకపోతే ఇప్పుడు అలా కాదని అంటున్నారు. ఇదంతా నామినేటెడ్ పదవుల గురించి రాష్ట్రం ఏర్పడిన అనంతరం దఫాదఫాలుగా వాయిదా పడుతున్న నామినెట్ పదవుల భర్తీ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ వారంలో లోగా పూర్తిచేయాలని కేసీఆర్ డిసైడయ్యారట. ఇంకా చెప్పాలంటే…బడ్జెట్ సమావేశాల్లోపు రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేయాలని కేసీఆర్ అదేశించారు. ఈ బాధ్యతను 17మంది మంత్రుల మీద పెట్టారు.

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే అవకాశమివ్వాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ ప్రక్రియను వేగంగా ముగించాలన్న ముఖ్యమంత్రి కచ్చితమైన ఆదేశాలతో ఆదివారం సాయంత్రం మంత్రులందరూ హుటాహుటిన ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. రాష్ట్ర జిల్లా స్థాయి పదవులపై రోజంతా కసరత్తు చేశారు. నియోజకవర్గ స్థాయి ఆ లోపు పదవుల అంశం మీద రేపటినుంచి పూర్వ జిల్లా కేంద్రాలు – నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల పదవులను భర్తీ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలకమైన కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది.

రాష్ట్రస్థాయిలో విభజన ప్రక్రియను పూర్తిచేసుకున్న మిగిలిన కార్పొరేషన్లకు కూడా ఈ సారి ఛైర్మన్లతోపాటు పాలకవర్గాలను నియమించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తును వెంటనే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి తన సహచర మంత్రులను ఆదేశించారు. మంత్రులందరూ ప్రగతిభవన్ లో సమావేశమై శాఖల వారీగా విభజన ప్రక్రియ పూర్తయిన కార్పొరేషన్లను గుర్తించారు. దీనితోపాటు జిల్లా స్థాయిలో ఉండే వివిధ నామినేటెడ్ పదవుల జాబితాను కూడా రూపొందించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మార్కెట్ కమిటీల నియామకం దాదాపు పూర్తికావచ్చింది. అక్కడక్కడా మిగిలిన మార్కెట్ కమిటీలకు ఈ విడత ఛైర్మన్లను నియమించనున్నారు. అనేక చోట్ల ఛైర్మన్ల నియామకం పూర్తయినా మార్కెట్ కమిటీలకు డైరెక్టర్లను పూర్తిగా నియమించలేదు. ఇప్పుడు డైరెక్టర్ల నియామకం పూర్తి చేస్తారు. ఇక జిల్లా – రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉండే ఫుడ్ అడ్వైజరీ బోర్డు సభ్యులు గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్లు – పాలకవర్గాలు – దేవాలయ కమిటీలు – నియోజకవర్గాలు – జిల్లాస్థాయి అసైన్ మెంట్ కమిటీలు తదితర పదవులను కూడా భర్తీ చేయనున్నారు. మార్చి 8వ తేదీ నుంచి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నది. ఈలోపే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి కావాలని సీఎం కచ్చితమైన ఆదేశాలిచ్చినట్టు తెలిసింది.

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు గ్రంథాలయాలు మార్కెట్ కమిటీలు ఫుడ్ అడ్వైజరీ కమిటీలు వన సంరక్షణ కమిటీలు వైద్యశాలల అభివృద్ధి కమిటీలు.. ఇలా సుమారు 20 రకాల కమిటీల్లో సుమారు నాలుగువేల వరకు పదవులు ఉంటాయని అంచనా. ఈ భర్తీ ప్రక్రియతో కనీసం నాలుగు వేల మందికి పదవులు లభిస్తాయని భావిస్తున్నారు. పార్టీకోసం తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంత్రులు జిల్లాలు నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో చర్చించి జాబితాలను సిద్ధం చేయబోతున్నారు. ఎవరెవరికి ఏఏ పదవులు ఇవ్వాలన్నది జాగ్రత్తగా చూడాలని వివాదాలు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించినట్లు తెలిసింది.

దీంతో మంత్రులు తమతమ పూర్వ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల స్థాయిలో సోమ మంగళవారాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెల్సింది. నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో చర్చించి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి పంపించనున్నారు. తర్వాత ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పదవుల భర్తీ ప్రక్రియను ముగించనున్నట్లు తెల్సింది. కొన్ని పోస్టులను మాత్రం బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా భర్తీ చేసే అవకాశం ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *