అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్

భారతదేశంలో అతి పెద్ద పార్టీల్లో టీఆర్‌ఎస్ ఒకటిగా నిలిచిందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. బుధవారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం టీఆర్‌ఎస్ సభ్యత్వం 75లక్షలు దాటుతున్నది. 3.64కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 75 లక్షల సభ్యత్వం దాటడం ద్వారా దేశంలో టాప్ మూడు పార్టీల్లో ఒకటిగా టీఆర్‌ఎస్ నిలుస్తున్నది. ప్రజల నుంచి పార్టీలో చేరడానికి అద్భుతమైన స్పందన వస్తున్నది. సభ్యత్వం పెరుగడం, ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టీఆర్‌ఎస్‌కు 51.50 లక్షల సభ్యత్వం ఉండేది. రెండేండ్లలో పెద్ద ఎత్తున సభ్యత్వం పెరిగింది. సభ్యత్వం ద్వారా రూ.25-30కోట్లు ఆదాయం వస్తున్నది. ఇప్పటికే రూ.13.50కోట్లు పార్టీ అకౌంట్‌లో జమయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో మొత్తం సభ్యత్వ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో ప్లీనరీ నిర్వహిస్తాం. 16వ వార్షికోత్సవ సభను 27న వరంగల్‌లో పెద్ద ఎత్తున జరుపుతాం. సభను ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజలు విజయవంతం చేయాలి. సభ గొప్పగా జరుగాలి అన్నారు.

వరంగల్ బహిరంగ సభ ఖర్చుల కోసం కూలి పనులు చేసి సంపాదించుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 14 నుంచి ఆరు రోజులపాటు గులాబీ కూలి దినాలు నిర్వహిస్తామని చెప్పారు. సభకు హాజరుకావడానికి బండి ఖర్చులకు, తొవ్వ ఖర్చులకు ఎవ్వరి ఖర్చులు వారే పెట్టుకోవాలి. దీనికోసం టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ రెండు రోజులు కూలీ చేయాలి. ఈ నెల 14 నుంచి 20వ తేదీల్లోపు రెండు రోజులు గులాబీ కూలీ దినాలు పాటించాలని నిర్ణయించాం. ఏదో ఒక చోట నేను కూడా కూలి పనిచేస్తా. ఏ ఊరి పార్టీ నాయకుడు ఆ ఊర్లో పనిచేయాలి. టీఆర్‌ఎస్ క్రమశిక్షణ గల పార్టీ. గతంలోనూ బహిరంగ సభల సమయంలో కూలి పనులు చేశాం. వచ్చిన డబ్బులతో వాహనాలను బుక్ చేసుకోవాలి. ప్రతి నాయకుడు, కార్యకర్త ఇందులో పాల్గొనాలని పిలుపునిస్తున్నాను. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి నాయిని నర్సింహరెడ్డి ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. దానికి సంబంధించిన ప్రక్రియను ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తారు అని సీఎం వివరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *