నా చివరి రక్తపుబొట్టూ తెలంగాణకే అంకితం – వరంగల్ సభలో సీఎం కేసీఆర్

తన చివరి రక్తపు బొట్టునూ తెలంగాణ కోసమే అంకితం చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బంగారు తెలంగాణ సాధించేవరకు మడమ తిప్పబోనని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేయాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ చెప్పారు. రైతులు కాలుమీద కాలేసుకుని కూసోని రంది లేకుండా ఉండాలన్న లక్ష్యంతో 500 కోట్లతో రైతు సమాఖ్య ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే రోజుల్లో పంటల ధరల నిర్ణయాధికారం రైతు సమాఖ్యకే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతోనే టీఆర్‌ఎస్ పార్టీగా 16 ఏండ్లు ప్రస్థానాన్ని కొనసాగించి అధికారం చేపట్టామని, 2019లో కూడా ప్రజల మద్దతుతో బ్రహ్మాండమైన విజయం సాధిస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం వరంగల్‌లో ప్రగతి నివేదన సభ పేరుతో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.

తెలంగాణ సాధించినపుడు రాష్ట్రం విధ్వంసానికి గురై భయంకరమైన పరిస్థితులు ఉండేవని తెలిపారు. కరెంటు సమస్యనుంచి రాష్ర్టాన్ని గట్టెక్కించామని, 40 వేల కోట్లతో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నామని, దేశంలోనే అతిపెద్ద పాలనా సంస్కరణలు అమలు చేశామని చెప్పారు. గ్రామీణార్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు వ్యవసాయానుబంధ రంగాలకు భారీగా నిధులు సమకూర్చుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని గొల్లకుర్మలకు 84లక్షల గొర్రెపిల్లలు పంపిణీ చేస్తున్నామని, వీటి వల్ల రానున్న రెండేండ్లలో యాదవులకు నాలుగైదు ఈశాన్యరాష్ర్టాల బడ్జెట్‌ను మించిన సంపద సమకూరుతుందని చెప్పారు.

ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న ప్రాజెక్టులను చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో కాంగ్రెస్ కోర్టులకెక్కి అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆయన మండిపడ్డారు. వారిని అడుగడుగునా ప్రజలే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధిని ఆగనివ్వనని, ఎన్ని బాధలు పడైనా సరే కచ్చితంగా బంగారు తెలంగాణ సాధిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సభావేదికగా ఓవైపు 16 ఏండ్ల పార్టీ ప్రస్థానాన్ని.. మరోవైపు మూడేండ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు ఆయన నివేదించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 16 సంవత్సరాల పాటు పార్టీ ఎదిగిన తీరును.. ఈ క్రమంలో ఎదురైన అవహేళనలు, సవాళ్లను ఎదుర్కొని ప్రజాబలంతో ముందుకు సాగిన వైనాన్ని వివరించారు. తర్వాత సమైక్యరాష్ట్రంనుంచి విధ్వంసమైన తెలంగాణను వారసత్వంగా తీసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరించి నూతన రాష్ర్టానికి పునాదులు నిర్మిస్తున్న వైనాన్ని వివరించారు. గ్రామీణార్థికాభివృద్ధికి తాము చేపట్టిన ప్రణాళికను వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలకోసం చేపట్టిన పథకాలను వివరించారు. రైతులు సంఘాలుగా ఏర్పడవలిసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…

సార్ ముందుగా మాట్లాడేవారు..

ఓరుగల్లు.. పోరుగల్లు. ఇదే గ్రౌండ్‌లో అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నం. కానీ కొంచెం బాధగా ఉంది. దుఖఃంగా ఉంది. అన్ని సభల్లో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ ముందు మాట్లాడి.. తరువాత నేను మాట్లాడే వాడిని. దురదృష్టం వారు మన మధ్య లేరు. అయినా స్వర్గం నుంచి జయశంకర్ చూస్తున్నారు. ఆశ్వీరాదం చేస్తున్నారు. జయశంకర్ సార్ అమర్ రహే అని స్వర్గానికి వినిపించే విధంగా చప్పట్లతో నివాళి అర్పిద్దాం.

సమైక్య రాష్ట్రంలో జీవన విధ్వంసం..

సమైఖ్య రాష్ట్రంలో జీవన విధ్వంసం జరిగింది. రైతు ఆత్మహత్యలు చేసుకున్నరు.. చేనేత కార్మికుల ఆకలి చావులు. పటాకులు పేలినట్లు ట్రాన్స్‌ఫార్మర్లు , కరెంటు మోటార్లు కాలిపోయేవి. ఇదీ 2014 జూన్ 2న మన ముందు ఉన్న ముఖచిత్రం. ఈ సందర్భంలో ఏం చేయాలి? అన్నింటి కంటే ముందు తొలగించాల్సి బాధ కరెంటు బాధ. చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. మేమింత సిపాయిలం మేమే చెయ్యలేదు. నువ్వు చేస్తవా అన్నరు. అద్భుతం చేస్తావా అన్నడు. ఆరు నెలల తిరగకముందే కరెంటు సమస్య తొలగించాం. ఒక్క కరెంటు మోటారు కాలిపోతలేదు. యాసంగిలో 23 జిల్లాల ఆంధ్ర కంటే ఎక్కువగా 9500 మెగావాట్ల లోడు వచ్చినా కరెంటు సైప్లె చేసినం. పరిశ్రమల్లో ఇప్పుడు మూడుషిప్ట్‌లు పనిచేస్తున్నారు. పవర్ హాలిడే లేవు. రూ. 40 వేల కోట్లతో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. 40 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది భారతదేశంలో ఒక్క తెలంగాణనే.

చివరికి ఎక్కడిదాక పోయినం అంటే దవాఖానల్లో పేదలు చనిపోతే శవాలను ఉచితంగా తీసుకపోవడానికి పరమపదం పేరుతో వాహనాలు ఏర్పాటు చేసినం. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ఏజిల్లాకు అయినా తీసుకపోతున్నం. జీవన విధ్వంసం జరిగింది కాబట్టి సంక్షేమ కార్యక్రమంతో కాపాడుకోవాలి. పేదలను, వృద్ధులను, వితంతవులను అదుకోవాలి అనుకున్నం. అలాగే ప్రజలకు మంచి నీళ్ల బాధ శాశ్వతంగా పోవాలి. దాని కోసం రూ. 40 వేల కోట్లతో మిషన్ భగీరథ తీసుకున్నం. ఈ సంవత్సరం చివరి నాటికి గ్రామగ్రామాన కృష్ణా , గోదావరి నీళ్లు వస్తాయి. ఇప్పటికే ఆ పనులు మీ ముందు కనపడుతున్నాయి. తర్వాత పరిపాలన సంస్కరణలు జరగాలి. బెజ్జూరు నుంచి అదిలాబాద్ పోవాలంటే 300 కిలోమీటర్లు. నంగునూరు మండలం నుంచి సంగారెడ్డి పోవాలంటే 220 కిలోమీటర్లు. ప్రయాస. 31 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. 125 మండలాలు,60 పైచిలుకు రెవెన్యూ డివిజన్లు పెంచుకున్నం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పరిపాలన సంస్కరణలు చేశాం.

ప్రాణం పోయినా అభివృద్ధి కార్యక్రమాలు ఆగనివ్వను..

ప్రాణం పోయినా సరే అభివృద్ధిని ఆగనీయను. ఎన్ని బాధలు పడైనా సరే ఖచ్చితంగా సాధిస్తానని మనవి చేస్తున్న. ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఆదరించి విజయం అందించారు.. ఉప ఎన్నికలు వచ్చినా లోకల్ బాడీ,అసెంబ్లీ ఉప ఎన్నికలు కావచ్చు. వరంగల్ ఎంపీ స్థానానికి నాలుగు లక్షల 60 వేల మెజార్టీ అందించారు. ఇక మాకు గతి లేదనుకున్నరు. రకరకాల కథలు చేస్తున్నరు. సీపీఐ నారాయణ అన్నడు. హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిస్తే చెవ్వు కోసుకుంటనని అన్నడు..ఓట్లు లెక్కబెట్టే నాడు హైదరాబాద్‌లో ఉండవద్దు.. మీ చెవ్వు పోతదని చెప్పిన. ఒంటి చెవ్వు నారాయణను చూడలేనని చెప్పిన.. ఓడు చెవ్వు కోస్కుంట అంటడు. ఇంకోడు గడ్డం పెంచుకుంట అంటడు. 2019లో గెలిచినంక సూద్దాం.. ఎవడెవడు ఏమేం కోస్కుంటడో..

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *