పీటర్సన్‌ పిచ్చి వ్యాఖ్యలు.. మండిపడ్డ అభిమానులు

వెస్టిండీస్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ దారుణ పరాభావాన్ని వెనక్కేసుకొచ్చిన ఆ జట్టు మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌పై అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 10 వికెట్లతో తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. అయితే ఈ ఓటమిని సమర్ధిస్తూ… ‘గుర్తుపెట్టుకోండి.. ప్రస్తుతం ఇంగ్లండ్‌ క్రికెట్‌కు టెస్ట్‌ క్రికెట్‌ అంత ప్రాధాన్యత కాదు. వారి లక్ష్యమంతా వన్డే ప్రపంచకప్‌ గెలవడమే.. దానిపైనే వారు కసరత్తులు చేస్తున్నారు’ అని ట్వీటర్‌ వేదికగా తమ ఆటగాళ్లను పీటర్సన్‌ వెనకేసుకొచ్చాడు. అయితే ఆటగాళ్లకు మద్దతుగా నిలిస్తే తప్పేం లేదు కానీ.. ఇక్కడ టెస్ట్‌ ఫార్మాట్‌నే తక్కువ చేసేలా స్టేట్‌మెంట్‌ ఇవ్వడం.. అభిమానులకు ఎక్కడ లేని ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా పీటర్సన్‌ను రోస్ట్‌ చేస్తున్నారు.

‘ఇదో పిచ్చి స్టేట్‌మెంట్‌.. ఇంగ్లండ్‌ యాషెస్‌ సిరీస్‌ ఓడిపోతుంది. అప్పుడు తెలుస్తోంది నొప్పంటే ఎంటో.. ప్రపంచకప్‌ లీగ్‌ దశ నుంచే నిష్క్రమిస్తోంది’  అని ఒకరు.. ‘ఇలాంటి వ్యాఖ్యలతో ప్రపంచ క్రికెట్‌ పరిస్థితి ఎంటో అర్థమవుతోంది’ అని మరొకరు.. ‘90ల్లో టెస్ట్‌ ఫార్మాట్‌లో నెం.1గా ఉన్న ఆసీస్‌ ప్రపంచకప్‌లు గెలువలేదా? ఇంగ్లండ్‌ రెండు ఫార్మాట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.. పీటర్సన్‌ నుంచి ఓ పిచ్చి వ్యాఖ్య’ అని ఇంకొకరు మండిపడ్డారు. విండీస్‌తో తొలి టెస్ట్‌లో 381 పరుగులతో ఇంగ్లండ్‌ దారుణ పరాభావాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. 2009 తర్వాత ఇంగ్లండ్‌పై వెస్టిండీస్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం కావడం విశేషం. మూడో టెస్టు ఈ నెల 9నుంచి గ్రాస్‌ ఐలెట్‌లో జరుగుతుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *