కౌసల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ

త‌మిళంలో మంచి విజ‌యాన్ని అందుకున్న ‘క‌ణ’ని ఇప్పుడు ‘కౌస‌ల్య కృష్ణ‌మూర్తి’గా తెలుగులోకి తీసుకొచ్చారు. మ‌రి ఈసారి ఏమైంది?  క‌ణ‌ని కౌస‌ల్య గుర్తుకు తెచ్చిందా?  అక్క‌డి మ్యాజిక్ తెలుగులోనూ కొన‌సాగిందా, లేదా?

కథ:

కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌) ఓ రైతు. త‌న‌కు వ్య‌వ‌సాయం అంటే ఎంతిష్ట‌మో.. క్రికెట్ అన్నా అంతే ఇష్టం. ఇండియా ఓడిపోతే అస్స‌లు త‌ట్టుకోలేడు. తండ్రిని చూసి తాను కూడా క్రికెట్‌పై మ‌క్కువ పెంచుకుంటుంది కౌసల్య (ఐశ్వ‌ర్య రాజేష్‌). ఇండియా త‌ర‌పున ఆడి, క‌ప్పు గెలిచి తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నుకుంటుంది. అమ్మ (ఝాన్సీ) మాత్రం మ‌గ‌పిల్ల‌ల‌తో ఆట‌లేంటి? అని అడ్డుకుంటూ ఉంటుంది. అబ్బాయిల‌తో క్రికెట్ ఆడుతుంటే ఊళ్లో వాళ్లు సూటిపోటి మాట‌లు అంటుంటారు. అయినా వాట‌న్నింటినీ త‌ట్టుకుని క్రికెట‌ర్‌గా అడుగులు వేస్తుంది కౌసల్య‌. మ‌రి తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించిందా, లేదా? త‌న తండ్రి ఆనందం కోసం త‌న ల‌క్ష్యం కోసం కౌస‌ల్య ఎన్నికష్టాలు ప‌డింది?

విశ్లేషణ:

ఓ సాధార‌ణ‌మైన అమ్మాయి, మారుమూల ప‌ల్లెటూరిలో పుట్టిన అమ్మాయి జాతీయ స్థాయి క్రికెట‌ర్‌గా ఎదిగిన వైనం ఈ సినిమాలో చూపించారు. ఓ అమ్మాయి క్రికెట‌ర్‌గా ఎదిగే తీరు, ఓ రైతు ప‌త‌నం.. ఇవి రెండూ ఒకే క‌థ‌లో ఇమిడ్చి, చివ‌ర్లో రైతుల్ని బ‌తికించండి, రైతుల్ని అప్పుల పాలు చేయొద్దు అంటూ సందేశం ఇచ్చిన వైనం అంద‌రికీ న‌చ్చుతుంది. ఓ క్రీడానేప‌థ్యం ఉన్న క‌థ‌ని ఎంచుకుని, దాన్ని స‌మ‌కాలీన రైతు ప‌రిస్థితుల‌కు మేళ‌వించి చెప్ప‌డం బాగుంది. క్రికెట్ నేప‌థ్యంలో సాగే సన్నివేశాల‌న్నీ బాగా తీశారు. అవి న‌చ్చుతాయి కూడా తొలి స‌న్నివేశాలు స‌ర‌దాగా సాగిపోతూ, అక్క‌డ‌క్క‌డ ఎమోష‌న్‌తో మ‌న‌సుల్ని మెలిపెడుతూ సాగితే, ద్వితీయార్ధంలో ఉత్కంఠ‌త చోటు చేసుకుంటుంది. క‌థ‌లో భావోద్వేగాలు, తండ్రీ కూత‌ళ్లఎమోష‌న్‌, దేశ‌భ‌క్తి ఇవ‌న్నీ బాగా క‌లిసిపోయాయి. ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కొన్న కౌస‌ల్య – విజేత‌గా నిల‌వ‌డం, తండ్రి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే క్లైమాక్స్‌. అదెలా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చడంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌లీకృతుడ‌య్యాడు. పాట‌లు న‌చ్చుతాయి. కెమెరా వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది. రైతుల గురించి  చెప్పిన డైలాగులు చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. అయితే ‘క‌ణ‌’లోని స‌న్నివేశాల్ని స‌గానికి పైగా వాడుకున్నారు. దాంతో క‌ణ చూసిన వాళ్ల‌కు ఇది డ‌బ్బింగ్ సినిమాలా అనిపిస్తుంది. క‌థ‌లో మార్పులు చేర్పులు చేయ‌డానికి ద‌ర్శ‌కుడు ఏమాత్రం సాహ‌సం చేయ‌లేక‌పోయాడు.

ప్లస్ పాయింట్స్:  కథ,కథనం,ఎమోషనల్ ఎలిమెంట్స్

నెగెటివ్ పాయింట్స్: రీమేక్ లో మార్పులు చేయకపోవడం

 

టైటిల్: కౌసల్య కృష్ణమూర్తి

రేటింగ్: 3/5

తారాగణం: ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌ తదితరులు

సమర్పణ: కేఎస్‌ రామారావు

దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు

సంగీతం: దిబు నిన్నాన్‌ థామస్‌

నిర్మాత: కేఎ వల్లభ

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *