ట్రంప్ తీరుపై బాబు, కేటిఆర్ స్పందన

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి అమెరికా ప్రజలే కాక యావత్ ప్రపంచ దేశాల ప్రజలు, నేతలు కూడా భిన్నభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన గురించి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హెచ్1-బి వీసాలపై అంక్షలపై మంత్రి కేటిఆర్ స్పందించారు.

“ఒక కుటుంబ పెద్ద సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఒక రాష్ట్రం లేదా దేశాధినేత అసమర్ధుడైతే ఆ రాష్ట్రం, దేశం తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తే అలాగే ఉంది. ఆయన తన దేశాన్ని తిరోగమన దిశలో నడిపించడం మొదలుపెట్టాడు. ఆయన అధికారం చేపట్టిన 10 రోజులలోనే అమెరికాను, ప్రపంచదేశాలలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. దేశాన్ని ఏవిధంగా నడిపించకూడదో తెలుసుకోవాలంటే ఆయనను చూస్తే అర్ధం అవుతుంది,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

హెచ్1-బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కొత్తగా విధించిన ఆంక్షలపై మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “హెచ్1-బి వీసాల విధించిన ఆంక్షలు విధిస్తూ ట్రంప్ సంబంధిత ఫైల్ పై సంతకం చేసినప్పటికీ అది తక్షణమే అమలు చేయలేరు. దానికి అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు), సెనేటర్ల ఆమోదం పొందాలి. అప్పుడే అది ఆచరణలోకి వస్తుంది. కనుక తాజా ఆంక్షలను చూసి ప్రవాస భారతీయులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. ఈలోగా దానిని అడ్డుకోవడానికి మనం కూడా మన ప్రయత్నాలు చేద్దాము. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో నేను డిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతాను. భారత ప్రభుత్వం తరపున కూడా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మనకు నష్టం కలుగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిద్దాము. అలాగే అమెరికాలో మనకు అనుకూలంగా ఉన్న సెనేటర్ల ద్వారా కూడా ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అడ్డుకొనేందుకు ప్రయత్నిద్దాము,” అని అన్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *