మోడీపై కేటీఆర్ కు కోపమొచ్చింది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు – మంత్రి కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. శాసనమండలిలో బడ్జెట్ పై జరిగిన చర్చలో బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రుణమాఫీ తీరును తప్పుపట్టగా కేటీఆర్ మండిపడ్డారు. ‘రైతుల రుణాలు రూ. 17 వేల కోట్లు మాఫీ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. ఇదే విషయంపై గతంలో ఆర్ బీఐ – కేంద్ర ప్రభుత్వాన్ని సహకారం కోరితే సబ్సిడీలతో నష్టపోతామని తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో అదే బీజేపీ రూ.46 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. ఉత్తర్ప్రదేశ్ రైతులు రైతులైతే… తెలంగాణ అన్నదాతలు రైతులు కాదా’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

బీజేపీకి ఉత్తర్ ప్రదేశ్ కో విధానం తెలంగాణకో విధానం ఉంటుందా అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ”రుణమాఫీ చేస్తామని తెలంగాణ కోరితే వ్యతిరేకించిన బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ లో ఎలా చేసింది? నరేంద్ర మోడీ తెలంగాణకు ప్రధానమంత్రి కాదా? మిషన్ భగీరథకు రూ.15000 కోట్లు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసినా ఇవ్వలేదు. తెలంగాణకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా పైగా నిందారోపణ  చేస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వస్తాం. రుణమాఫీ – ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో సహాయం కోరుదాం” అని బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావును ఉద్దేశించి అన్నారు. తమపై అప్పుల రాష్ట్రం అని విమర్శలు చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు. ఎక్కువ అప్పులు చేస్తున్న నరేంద్రమోడీ భారతదేశాన్ని బకాయిల భారతదేశంగా మారుస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ మహారాష్ట్రలతో పాటు బీజేపీ మిత్రపక్షం టీడీపీ పాలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులు చేస్తున్నాయని కేటీఆర్  తెలిపారు.

అనంతరం ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్ అతి అంచనాలతో కూడుకుని ఉన్నదని విమర్శించారు. విద్యకు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ అతి తక్కువ బడ్జెట్ కేటాయించిందన్నారు. రాబడికి సంబంధించి కూడా భారీ అంచనాలు వేశారని అన్నారు. వ్యవసాయం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పాఠశాల విద్యకు బడ్జెట్ తగ్గిందన్నారు. ఎక్సైజ్ నుంచి రాబడి అంచనాను పెంచారని ఇది ఆరోగ్యం వైపు కాకుండా మద్యం వైపు ప్రజల ను ఆకర్షించాలని చెప్పేదిగా ఉందని విమర్శించారు. యూనివర్శిటీల్లో 70 శాతం పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. అప్పులతో కోరుకుంటున్న బంగారు తెలంగాణ కాకుండా బకాయిల తెలంగాణగా మారిపోతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాంచందర్ రావు అన్నారు. ప్రధానమంత్రికి ఏ రాష్ట్రంతో విబేధం లేదని తెలిపారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *