జీఈఎస్‌లో అన్నీ తానై..ఈవెంట్ల గ్రాండ్ సక్సెస్‌తో పెరిగిన కేటీఆర్ గ్రాఫ్

కేటీఆర్.. మిమ్మల్ని క్లోన్ (ప్రతిసృష్టి) చేసి.. మిగతా 28 రాష్ర్టాలకు కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి.. ఇది కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి, కేంద్ర డీవోపీటీ కార్యదర్శి అరుణా సుందర్‌రాజన్ చేసిన కామెంట్. జీఈఎస్ ప్రారంభానికి ఒకరోజు ముందు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంలో చేసిన ప్రశంస ఇది. సహజంగా కేంద్ర అధికారులు ఎవరూ రాష్ట్ర మంత్రులను పొగడరు. అలాంటిది మంత్రి కేటీఆర్‌కు ఈ కితాబు దక్కటం అభినందనీయం.. ఇది ఆ సమయంలో అక్కడే ఉన్న మరో అధికారి అన్న మాట. ఆస్ట్రేలియా రాయబారి కూడా మంత్రి కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.

భారతదేశాన్ని ఒకేగాటన కట్టి అంచనా వేయకుండా.. తెలంగాణ వంటి ప్రోగ్రెసివ్ రాష్ర్టాలను చూసి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుందని కేటీఆర్‌తో సమావేశమైన తర్వాత స్ఫురించింది. ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు నేను అనుసంధానకర్తగా ఉంటా. మా దేశంలోని రాష్ర్టాల ప్రతినిధులు కూడా తెలంగాణలో పర్యటించేందుకు తగిన చర్యలు తీసుకుంటా.. ఇవి ఆస్ట్రేలియా రాయబారి చెప్పిన మాటలు. ఈ రెండు ఉదాహరణలు చాలు ఇటు దేశవ్యాప్తంగా, అటు ప్రపంచవ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పనితీరుకు దక్కిన ప్రశంసలను అర్థం చేసుకోవటానికి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు సమీపిస్తున్న మెట్రో ప్రారంభ గడువు.. ఇంకోవైపు జీఈఎస్.. ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్రమోదీ.. ఇవాంకాట్రంప్. అతిథులుగా.. 150 దేశాలకు చెందిన 1500 మంది పారిశ్రామికవేత్తలు.. ఇంతటి మహత్కార్యాలను తన భుజానేసుకొని.. గ్రాండ్ సక్సెస్ చేసిన వ్యక్తి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో, అమెరికాకు చెందిన బాధ్యులతో, క్షేత్రస్థాయి సిబ్బందితో.. 24X7 అన్నట్టుగా సమన్వయం చేసి విశ్వనగర ప్రయాణ అనుభూతిని మార్చే మెట్రో ప్రారంభాన్ని.. అంతర్జాతీయ యవనికపై హైదరాబాద్ ఖ్యాతిని గర్వంగా చాటిన జీఈఎస్‌ను గ్రాండ్ సక్సెస్‌చేశారు.

జీఈఎస్‌కు ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోను ఆయన చేతుల మీదుగానే ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ సిద్ధమయ్యారు. ప్రతివారం సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లు సమీక్షించారు. దగ్గరుండి కమిషనర్ ఆఫ్ మెట్రో రైలు సేఫ్టీ నుంచి సర్టిఫికెట్ వచ్చేలా చేశారు. దీని ఫలితంగానే పలు నగరాల్లో మెట్రో ప్రారంభించిన అనంతరం కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ హైదరాబాద్‌లో అలాంటి ఇబ్బందులేవీ ఎదురుకాలేదని అంటున్నారు. నిత్యం ప్రధానమంత్రి కార్యాలయం సమీక్షించిందని.. అందుకే ప్రధాని మోదీ మెట్రో ప్రారంభోత్సవం సమయంలో స్వయంగా మంత్రి కేటీఆర్‌ను పిలిచి.. ఆయన వచ్చిన తర్వాతనే రిబ్బన్ కత్తిరించారని పలువురు గుర్తుచేస్తున్నారు.

అభినందిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
మెట్రో ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రదర్శించిన పరిణతిని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు. మెట్రో ప్రారంభోత్సవంలో తామిచ్చిన జాబితా మేరకే అతికొద్దిమంది అతిథులు ఉండాలని పీఎంవో స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రాష్ట్ర మంత్రులతోసహా నగర పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించి మెట్రో జర్నీ చేయించారు. మెట్రో గురించి తానే ప్రజాప్రతినిధులకు వివరించారు. దీంతో మెట్రో ప్రయాణానికి మరో రూపంలో ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి తప్పిందని ఓ ప్రజాప్రతినిధి పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంత్రి కేటీఆర్‌కు గుడ్‌లక్ చెప్తూ ట్వీట్ చేయడం విశేషం.

జీఈఎస్ గ్రాండ్ సక్సెస్ వెనుక..
జీఈఎస్ నిర్వహణ కోసం 8 ప్రధాన నగరాలు పోటీపడిన్నప్పటికీ, హైదరాబాద్‌కు ఆ అవకాశం దక్కటం లో మంత్రి కేటీఆర్ చొరవ, కృషి విశేషంగా పనిచేశాయి. కేంద్ర మంత్రులు, అధికారులతో ఉన్న సఖ్య త, సీఎం కేసీఆర్ పరిపాలనా తీరుపై విశ్వసనీయత, తన పనితీరుపై జాతీయస్థాయిలో ఉన్న సదాభిప్రా యం ఇందుకు ఉపకరించాయి. అమెరికా ప్రభుత్వా న్ని సైతం మెప్పించేలా ఆ దేశాధికారులతో సమన్వ యం చేశారు. వాలంటీర్ల వస్త్రధారణ నుంచి అతిథులకు అందించాల్సిన కానుకల వరకు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళా వాలంటీర్లు పోచంపల్లి చీరలు, పురుష వాలంటీర్లు పోచంపల్లి కోట్లు ధరించాలని స్పష్టంగా చెప్పిన కేటీఆర్.. డిజైన్ల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని అధికారి ఒకరు తెలిపారు. చక్కటి ఆంగ్ల భాషా ప్రావీణ్యం, వాక్చాతుర్యం, అద్భుతమైన కమ్యునికేషన్ నైపుణ్యంతో అతిథులు ముగ్ధులయ్యేలా మోడరేటర్‌గా వ్యవహరించిన కేటీఆర్ తన ముద్రను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *