అందుకే నన్ను ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు

ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి పెళ్లి వ్యవహారం అప్పట్లో అదో పెద్ద సంచలనం. తనకు అనారోగ్యంగా ఉన్న వేళ తనను ఆదరించి.. సేవలు చేసిన లక్ష్మీపార్వతి అంటే ఎన్టీఆర్ కు ప్రత్యేక అభిమానం. పిల్లలు అంతమంది ఉన్నా.. ఒంటరిగా ఉండాల్సిన వేళలో.. తనకు సాయంగా నిలిచిన లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవటానికి చాలానే కారణాలు ఉన్నాయి.

తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అలనాటి పెళ్లి విషయాలకు సంబంధించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు లక్ష్మీ పార్వతి. తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని తిరుపతి బహిరంగ సభలో అందరి ముందు ఎన్టీఆర్ ప్రకటించినప్పటికీ.. అంతకు ముందు ఇంట్లో వారితో చెప్పారన్నారు.

తనను పెళ్లి చేసుకునే విషయంలో ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ.. జయకృష్ణలు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అయితే.. కొడుకులు వ్యతిరేకించినా ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.

తనను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితుల గురించి లక్ష్మీపార్వతి వెల్లడించారు. ఒకసారి ఎన్టీఆర్ కు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. షుగర్ లెవల్స్ 450 చేరుకున్నాయని.. పాక్షిక పక్షవాతానికి గురయ్యారని.. ఆసమయంలో ఆయనకు దగ్గరుండి తాను సేవలు చేసినట్లు చెప్పారు. ఒకదశలో తనను వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఎన్టీఆర్ చెప్పారని.. కానీ బాగోలేనప్పుడు అలా విడిచి వెళ్లటం సరికాదని తాను ఉన్నట్లు లక్ష్మీ పార్వతి చెప్పారు.

తిరుపతి సభలో తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్పి.. తనను వేదిక మీదకు రావాలని ఆహ్వానించిన సమయంలో హటాత్తుగా మైకులు కట్ చేసి.. లైట్లు ఆర్పేశారన్నారు. తర్వాత జరిగిన పరిణామాలు తనకు కొంత ఇబ్బంది కలిగించాయన్నారు. తనను పెళ్లి చేసుకునే విషయం మీద తనతో చర్చించారన్న లక్ష్మీ పార్వతి.. తనను రహస్యంగా పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఎన్టీఆర్ కు ముందు నుంచి లేదన్నారు.

తన పెళ్లిని కుటుంబసభ్యుల సమక్షంలో చేసుకోవాలని భావించినట్లు చెప్పారు. పెళ్లి ప్రతిపాదనను ఎన్టీఆర్ కుమారులు రామకృష్ణ.. హరికృష్ణలు ఇద్దరు వ్యతిరేకించినట్లు చెప్పారు. తిరుపతి సభ తర్వాత మీడియా సమావేశంలోనే తనకు ఎన్టీఆర్ తాళి కట్టిన విషయాన్ని లక్ష్మీ పార్వతి గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అనారోగ్యంగా ఉన్న సమయంలో తాను చేసిన సేవలతో ఆరోగ్యంగా మారారని చెప్పారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *