అంబరాన్నంటిన మహా బతుకమ్మ

ఆకాశంలో సగం.. జగమంతా మెరిసేలా బతుకమ్మ ఆడింది. ఆడబిడ్డలంతా లయబద్ధమైన చప్పట్లతో, క్రమబద్ధంగా అడుగులేస్తూ మహా బతుకమ్మపై కొలువైన గౌరమ్మను కొలుస్తుంటే తెలంగాణ మురిసిపోయింది. రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహాబతుకమ్మ ఉత్సవాన్ని మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత స్టేడియంలోకి ప్రవేశించగానే యావత్ మైదానం జై తెలంగాణ నినాదంతో మార్మోగింది. సాయంత్రం 4.40 గంటలకు కవిత శాస్ర్తోక్తంగా గౌరవమ్మకు హారతిపట్టి మహా సంబురాన్ని ప్రారంభించారు. అతిథులందరికీ సాంస్కృతిక శాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం స్వాగతం పలికారు. కార్యక్రమానికి దక్షిణామూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడాలేని పూలపండుగ మన బతుకమ్మ. ఈ పండుగను అందరం కలిసి ఆడుకుందాం అని పిలుపునిచ్చారు.

తెలంగాణ సంస్కృతి, కళలు వర్థిల్లాలి అంటూ ఆమె నినాదం ఇవ్వగానే ఆడబిడ్డలందరూ గొంతు కలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఇంత సంతోషంగా, సంబురంగా పండుగ చేసుకోగలుగుతున్నామని కవిత అన్నారు. ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆడుకోవాలంటే అనుమతులకోసం కోర్టులచుట్టూ తిరుగాల్సివచ్చేదన్నారు. తెలంగాణకే చెందిన ఘనవారసత్వ సాంస్కృతిక సంపదకు చిరునామాగా నిలిచిన బతుకమ్మ పండుగను పరిరక్షించుకుందామన్నారు. తెలంగాణ సంస్కృతికి పట్టుగొమ్మలుగా ఉన్న బోనాలు, బతుకమ్మ పండుగలను ఘనంగా నిర్వహించేందుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్ని చర్యలూ తీసుకుంటున్నారని తెలిపారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ మహిళాశక్తిని చూసి ప్రపంచం నివ్వెరపోతున్నదన్నారు. బతుకమ్మ పండుగద్వారా రాష్ర్టానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తున్న ఆడబిడ్డలందరికీ శుభాభినందనలు తెలిపారు. బ్రహ్మకుమారీస్ డైరెక్టర్ కుల్దీప్‌దీదీ మాట్లాడుతూ ప్రపంచపౌరుల ఆధ్యాత్మిక సాంస్కృతిక ఐక్యతను చాటిచెప్పే పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మలో పూలన్నీచేరి ఒక్కటై, కొత్త అందాలను కురిపించినట్టు భారతీయులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ప్రకృతి మేళవింపుగా కనిపిస్తున్న ఈ పండుగ విశ్వబంధు ప్రేమను చాటి చెప్తున్నదని అన్నారు.

మధ్యాహ్నం మూడు గంటలనుంచే స్టేడియంలో సందడి మొదలైంది. పడమటి రాజులు ఉయ్యాలో సీతమ్మనడిగిరి ఉయ్యాలో.. విల్లువిరిచినవారికి ఉయ్యాలో సీతమ్మనిత్తుము ఉయ్యాలో.. వంటి పాటలకు మహిళలు కోరస్ పాడారు. గుండ్రంగ పూసినయి చందమామ గుమ్మాడి పువ్వులు చందమామ.. కొమ్మల్ల పూసినవి చందమామ.. గోరంట పువ్వులు చందమామ.. అంటూ పాడుకున్నారు. 25 అడుగుల ఎత్తున పేర్చిన మహా బతుకమ్మ చుట్టూ భారతీయ కాలమానంలోని 60 సంవత్సరాలకు ప్రతిరూపంగా 60 బతుకమ్మలను ఉంచారు. వాటి చుట్టూ ఉత్సాహంగా ఆడిపాడారు. వారితో కవిత పదం కలిపి, పాదం కదిపి ఉత్సాహపరిచారు. రెండు గంటలపాటు ఆటపాటలతో స్టేడియం హోరెత్తింది. పల్లె పలుకుబడి, తల్లుల ఆకాంక్షలతో ఉయ్యాలపాటలు పాడిన అమ్మలంతా అలసటేలేని ఆటతో స్టేడియానికి వచ్చిన వేలమందికి కనువిందు చేశారు. కథాకళి, కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి నృత్యకారులు తమ కళలను ప్రదర్శించారు. అద్దాల రవికెలతో లంబాడీలు, గతకాలపు కట్టూబొట్టుతో ఆదిలాబాద్ అడవిబిడ్డలు ఆయా ప్రాంతాల సంప్రదాయాలను ప్రతిబింబించే వస్త్రధారణతో వేడుకకు ప్రత్యేకత తీసుకొచ్చారు.

మహాబతుకమ్మ ఆట ముగిసిందని అధికారులు ప్రకటించినా అలిసిపోని ఉత్సాహంతో మళ్లీరా బతుకమ్మ.. వెళ్లి రావమ్మ.. అని పాడుకుంటూ వీడ్కోలు పలికారు. తెలంగాణ జాగృతి సభ్యులు అందరినీ క్రమశిక్షణతో నిలబెట్టడంతోపాటు మంచినీళ్ల ప్యాకెట్లు అందించారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌వంటి సమీప రాష్ర్టాలకు చెందిన బ్రహ్మకుమారీలు పెద్ద సంఖ్యలో ఈ పండుగకు హాజరయ్యారు. దాదాపు 15 రాష్ర్టాల మహిళలతోపాటు పలువురు విదేశీ వనితలు వేడుకలో పాల్గొని సందడిచేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. సోమవారం తెల్లవారుజామునుంచి జరిగిన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, నగర, పోలీస్ అధికారులు పర్యవేక్షించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *