రివ్యూ: ‘మనసుకు నచ్చింది’ మూవీ

కథ :
సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య (అమైరా దస్తూర్‌) ఒకే ఫ్యామిలీలో కలిసి పెరిగిన స్నేహితులు. వాళ్ల స్నేహాన్ని ప్రేమగా భావించిన పెద్దవాళ్లు వాళ్లకు పెళ్లిచేయాలని నిర్ణయిస్తారు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్‌, నిత్యలు ఇంట్లోనుంచి పారిపోతారు. తమ ఫ్రెండ్‌ శరత్‌(ప్రియదర్శి) సాయంతో గోవాలోని ఓ గెస్ట్‌ హౌజ్‌లో ఉంటుంటారు. అప్పటి వరకు ఎలాంటి గోల్స్‌ లేని సూరజ్‌ గోవా వెల్లిన తరువాత ఫొటోగ్రాఫర్‌ కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతాడు. కానీ నిత్యా ధైర్యం చెప్పటంతో కూల్ అవుతాడు. అదే సమయంలో నిత్య.. తనకు సూరజ్‌ మీద ఉన్నది ఇష్టం కాదు ప్రేమ అని తెలుసుకుంటుంది. సూరజ్‌ కూడా ఏదో ఒకరోజు తన ప్రేమను ఫీల్‌ అవుతాడని ఎదురుచూస్తుంటుంది. కానీ ఈ లోగా గోవాలో పరిచయం అయిన నిక్కి (త్రిదా చౌదరి)ని సూరజ్‌ ఇష్టపడతాడు. అదే సమయంలో అభయ్‌ (అదిత్‌ అరుణ్‌) అనే కుర్రాడు నిత్యను ఇష్టపడతాడు. దీంతో వారి పెద్దలు ఈ రెండు జంటలకు పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. చివరకు సూరజ్‌.. నిత్య ప్రేమను అర్ధం చేసుకున్నాడా..? వారిద్దరు ఒక్కటయ్యారా..? ప్రయాణంలో అసలు ప‍్రకృతి పాత్ర ఏంటి అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సందీప్‌ కిషన్‌ తనకు అలవాటైన యూత్‌ ఫుల్‌ క్యారెక్టర్ లో కనిపించాడు. అయితే ఎమోషనల్‌ సీన్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే చాలా సన్నివేశాల్లో సందీప్‌ నటన నిరాశపరుస్తుంది. హీరోయిన్‌ అమైర దస్తూర్‌ అందంతో ఆకట్టుకుంది. నటన పరంగానూ పరవాలేదనిపించింది. మరో హీరోయిన్‌గా నటించిన త్రిదా చౌదరి పూర్తిగా గ్లామర్‌ షోకే పరిమితమైంది. ప్రియదర్శి లాంటి లీడింగ్ కమెడియన్‌ను హీరో ఫ్రెండ్‌ పాత్రకు తీసుకున్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి డైలాగ్స్‌లో గత చిత్రాల్లో కనిపించే చమక్కులు ఈ సినిమాలో మిస్‌ అయ్యాయి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఘట్టమనేని వారసురాలు, మంజుల కూతురు జాన్వీ మంచి నటన కనబరించింది. ఇంగ్లీష్ కలిసి తెలుగు యాక్సెంట్‌లో జాన్వీ చెప్పిన డైలాగ్స్‌ అలరిస్తాయి. ఇతర పాత్రలు పెద్దగా తెర మీద కనిపించవు. అదిత్‌ అరుణ్‌, నాజర్‌, సంజయ్‌, అనితా చౌదరిలవి దాదాపుగా అతిథి పాత్రలే.

విశ్లేషణ :
మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా చేసిన తొలి ప్రయత్నంలో ఆకట్టుకోలేకపోయింది. రొటీన్‌ ట్రయాంగ్యులర్‌ లవ్‌ స్టోరికి ‘నేచర్‌’ అనే ఎలిమెంట్‌ను జోడించి చేసిన ఈ ప్రయత్నం పూర్తిగా నిరాశపరిచింది. కథలో కొత్తదనం లేకపోవటం కథనం కూడా నెమ్మదిగా సాగటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో ఆకట్టుకునే ఒకే ఒక్క అంశం సినిమాటోగ్రఫి, ప్రకృతి అందాలను వెండితెర మీద మరింత అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ రవియాదవ్‌. రధన్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ఫ్రేము రిచ్‌గా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
హీరోయిన్ల గ్లామర్‌

మైనస్ పాయింట్స్ :
కథా కథనం

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *