నేడు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రేస్‌కోర్స్ రోడ్‌లోని ప్రధాని నివాసంలో ఉదయం 11.45 గంటలకు ఈ భేటీ జరుగనుంది. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆదివారం నీతిఆయోగ్ సమావేశంలో వ్యవసాయరంగం మీద తన విజన్‌ను ఆవిష్కరించారు. కాగా సోమవారం ప్రధానితో జరిగే సమావేశంలో రాష్ర్టానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలు మొదలుకొని నిన్న మొన్నటి బీసీ-ఈ రిజర్వేషన్ల దాకా అనేక కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. సీఎం ప్రధానంగా బీసీ-ఈ గ్రూపు రిజర్వేషన్ల పెంపు బిల్లు, వ్యవసాయానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తింపు, అసెంబ్లీ సీట్ల పెంపు, రిజర్వేషన్ల విషయంలో రాష్ర్టాలకు స్వేచ్ఛ, ఎస్సీ వర్గీకరణ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు, హైకోర్టు విభజన తదితర అంశాలు ప్రధాని దృష్టికి తేనున్నారు. వీటితోపాటు ప్రధాని ప్రస్తావించిన ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు అంశం, నోట్ల రద్దు అనంతర పరిణామాలు తదితర జాతీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

విభజన సమస్యలు మరోసారి..

రాష్ట్ర విభజన చట్టం అమలులో జరుగుతున్న జాప్యాన్ని సీఎం ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి మూడేండ్లు కావస్తున్నా ఇంకా పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అంశాలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రధానికి వివరించనున్నారు. అలాగే కొన్ని పెండింగ్ అంశాలమీద జాతీయ స్థాయిలోనే విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ప్రస్తావించనున్నారు. ప్రత్యేక హైకోర్టు అంశాన్ని యథావిధిగా మరోసారి ఆయన దృష్టికి తీసుకు రానున్నారు. వ్యవసాయ రంగం గురించి నీతి ఆయోగ్ సమావేశంలో సుదీర్ఘంగా తన మనసులోని ఆలోచనలను పంచుకున్నందువల్ల మిగిలిన అంశాలపై దృష్టి పెట్టనున్నారు.

శాసనసభ స్థానాల పెంపు..

పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు విషయమై ఏర్పడిన చిక్కులకు వీలైనంత తొందరగా పరిష్కారం కనుగొని పార్లమెంటులో బిల్లు పెట్టాలని విజ్ఞప్తి చేయనున్నారు.

తమిళతరహా అవకాశమివ్వండి..

తెలంగాణ శాసనసభ ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై బీసీ-ఈ గ్రూపు కింద రిజర్వేషన్లను పెంచుతూ ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించిన విషయాన్ని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించనున్నారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు తరహాలో రాష్ర్టాలే వాటివాటి అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీల్లోనూ వెనుకబడిన కులాలకు ప్రభుత్వాలు చేయూతనివ్వాలని ప్రధాని మోదీ స్వయంగా భువనేశ్వర్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ శాసనసభ చేసిన చట్టం గురించి ఆయన వివరించనున్నారు.

వ్యవసాయానికి అనుసంధానంగా ఉపాధి..

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని ప్రధానితో భేటీలో సీఎం ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ ఇటీవల చేసిన తీర్మానం గురించి వివరించడంతో పాటు ఈ అంశంమీద ఇప్పటికే పలు రాష్ర్టాలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన డిమాండ్లను ప్రస్తావించనున్నారు. ఈ అనుసంధానం వల్ల అటు ఉపాధి కార్మికులకు, ఇటు వ్యవసాయదారులకు ప్రయోజనం కలుగుతుందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని సీఎం నొక్కిచెప్పనున్నారు.

ఒకేసారి ఎన్నికలకు సుముఖం..

గత ఏడాది కాలంగా చర్చనీయాంశంగా మారిన ఒకే దేశం – ఒకేసారి ఎన్నికలు అంశంపై టీఆర్‌ఎస్ అభిప్రాయాన్ని కేసీఆర్ ఈ భేటీ సందర్భంగా స్పష్టం చేయనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తొలి నుంచీ ఈ విధానానికి మొగ్గుచూపుతూనే ఉంది. పైగా సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నందువల ఒకే దేశం – ఒకేసారి ఎన్నికలు అనే విధానానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్న విషయాన్ని కూడా స్పష్టం చేయనున్నారు.

నోట్లరద్దు పరిణామం ఏమిటంటే..

నోట్లరద్దు నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం సమర్థించడమే కాకుండా దక్షిణ భారత దేశంలో నగదు రహిత గ్రామాన్ని తొలిసారిగా తీర్చిదిద్దింది. ఈ విషయాన్ని ప్రధానితో ప్రస్తావించడంతో పాటు నోట్లరద్దు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ప్రతిబింబిస్తుందో చర్చించే అవకాశం ఉంది. పారదర్శకతను పాదుకొల్పడంతో పాటు పన్ను ఎగవేతను అరికట్టడంలో నోట్లరద్దు ఏ విధమైన ఫలితాలను సాధించిందో, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇకపైన ఏయే రంగాల్లో ఎలాంటి సంస్కరణలను తీసుకురావచ్చో ఈ భేటీ సందర్భంగా చర్చించే అవకాశం ఉంది.
ఈ అంశాలతో పాటు ఎస్సీ వర్గీకరణ, వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఆర్థిక సాయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు-1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు చేయాల్సిన సవరణ తదితర అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *