ఆరు గంటల్లో ప్రపంచ రికార్డు బద్దలు

తమ అభిమాన కథానాయకుడి సినిమాకు సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా తమిళ ఫ్యాన్స్ మామూలు రచ్చ చేయట్లేదు. టీజర్లు, ట్రైలర్ వ్యూస్.. లైక్స్ విషయంలో ఒక టార్గెట్ పెట్టుకుని పని చేస్తున్నారు. కొన్ని నెలల కిందట అజిత్ సినిమా ‘వివేగం’ యూట్యూబ్‌లో ఎలా రికార్డుల మోత మోగించిందో తెలిసిందే.

విడుదలైన కొన్ని నెలలకు అది ‘స్టార్ వార్స్’ పేరిట ఉన్న టీజర్ లైక్స్ రికార్డును బద్దలు కొట్టేసి ఔరా అనిపించింది. ఐతే ఇప్పుడు విజయ్ సినిమా ‘మెర్సల్’ టీజర్ కేవలం కొన్ని గంటల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టేసేలా విజయ్ అభిమానులు మిషన్ నడిపారు. నాలుగే నాలుగు గంటల్లో ఇది ప్రపంచంలోనే అత్యధిక లైక్స్ తెచ్చుకున్న టీజర్‌గా రికార్డు నెలకొల్పింది.

ఈ నాలుగు గంటల్లోనే ‘మెర్సల్’ టీజర్‌కు ఏకంగా 6 లక్షల లైక్స్ వచ్చాయి. ‘వివేగం’ టీజర్ కొన్ని నెలల్లో సాధించిన లైక్స్ కొన్ని గంటల్లోనే తెచ్చుకుంది ‘మెర్సల్’ టీజర్. దీన్ని బట్టే విజయ్ అభిమానులు లైక్స్ విషయంలో ఎంత పట్టుదలతో వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ఈ టీజర్‌ నాలుగు గంటల్లోనే  3 మిలియన్ వ్యూస్ కూడా పూర్తి చేసుకుంది.

నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదలైన ఈ టీజర్.. కోటి వ్యూస్‌కు దగ్గరగా ఉంది. ఇండియాలో అత్యంత వేగంగా కోటి వ్యూస్ పూర్తి చేసుకున్న టీజర్‌గా ఇది రికార్డు సృష్టించబోతోంది. ‘రాజా రాణి’.. ‘తెరి’ సినిమాల దర్శకుడు అట్లీ రూపొందించిన ‘మెర్సల్’కు విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మీనన్ విజయ్‌కి జోడీగా నటిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *