తీరు మారకపోతే.. సస్పెన్షనే – కేసీఆర్

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రీతిమీనా పట్ల అనుచితంగా ప్రవర్తించిన మహబూబాబాద్‌ శాసనసభ్యుడు భానుశంకర్‌ నాయక్‌ను మహబూబాబాద్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికే మ్మెల్యే సొంత పూచీకత్తుపైనే పోలీసు స్టేషన్‌ నుంచి బెయిల్‌ పై విడుదలయ్యారు. శంకర్ నాయక్ తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనతో దురుసుగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్యేని మందలించారు. వెంటనే జిల్లా కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. జరిగిన ఘటన పట్ల ముఖ్యమంత్రి తన బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు.

కలెక్టర్ ప్రీతి మీనాతో మాట్లాడి ప్రభుత్వం తరఫున సముదాయించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్ ను సీఎం కేసీఆర్ ఆదేశించగా.. మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌ కలెక్టరు ఇంటికెళ్లారు. సుమారు గంటన్నరపాటు సంప్రదింపులు జరిపారు. అప్పటిదాకా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కలెక్టరు ఇంటి బయటే వేచి ఉన్నారు. కొంతసేపటికి లోపలి నుంచి కబురు రావడంతో ఇంట్లోకి వెళ్లిన ఆయన ఆమెకు క్షమాపణ చెప్పి పది నిమిషాల్లో బయటకొచ్చారు. ఆమె తనకు సోదరితో సమానమని, అనుకోకుండా చేయి తగిలి ఉండొచ్చంటూ విలేకరుల వద్ద వివరణ ఇచ్చారు. కలెక్టరు ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు శంకర్‌నాయక్‌పై పోలీసులు మహబూబాబాద్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కలెక్టర్‌ ఈ స్థాయిలో ఆరోపణలు చేయడంతో ప్రత్యేక దర్యాప్తు అధికారిగా రాజారత్నంను నియమించింది ప్రభుత్వం.. కలెక్టర్ ను కలిసిన దర్యాప్తు అధికారి.. ఘటనకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు. అదేవిధంగా ఘటన జరిగిన సమయంలో అక్కడున్న అధికారుల సాక్ష్యాలను విచారిస్తామని తెలిపారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. బుధవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, కలెక్టర్‌ ప్రీతి మీనాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ స్టేడియంలో మొక్కలు నాటారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో వేదికపైకి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కలెక్టర్‌ చెయ్యి పట్టుకోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి చందూలాల్‌కు వివరించగా ఆయన స్పందించలేదు. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు, ఐఏఎస్‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొంతకాలంగా తన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని.. ఆయన వైఖరితో తాను ఇబ్బంది పడుతున్నానని వెల్లడించినట్లు సమాచారం.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *