హౌడి మోదీ లో ట్రంప్ ప్రసంగం…

హ్యూస్టన్ వేదికగా నిర్వహించిన ‘హౌడీ మోదీ’కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఓ మెగా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభను ఉద్దేశించి మోదీ, ట్రంప్‌ చేసిన ప్రసంగాలకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపు అరగంట పాటు సభను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. భారత్‌, అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు మోదీతో కలిసి పనిచేస్తామని ఉద్ఘాటించారు. మోదీని గొప్ప నేతగా, ప్రపంచ సేవకుడిగా అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్‌తోపాటు ప్రపంచమంతటికీ మోదీ గొప్ప సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

భారతీయ సంస్కృతి, విలువలు తమతో కలిసిపోతాయని, ఇరుదేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచానికి మనం మార్గనిర్దేశనం చేస్తున్నామని, అమెరికా సమాజంలో ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయని ట్రంప్ వివరించారు. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో భారత్‌ పెట్టుబడులు పెడుతోందన్నారు. తమ దేశంలో తయారయ్యే అత్యుత్తమ వస్తువులు భారతీయులకు అందుబాటులో ఉంటాయని, భారత ఇంధన అవసరాలకు అమెరికా సహకారం అందజేస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. టెక్సాస్‌ నుంచి అవసరమైన చమురు ఉత్పత్తులను భారత్‌కు తరలిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అటు రక్షణ రంగంలో సహకారం ఉంటుందని తెలిపారు. భారత్ బలమైన ఆస్తి 40 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు.. ఈ సభకు 50 వేల మంది రావడం అత్యంత స్ఫూర్తిదాయకం… ఇది ఎంతో సంతోషకరమైన రోజు అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *