మూవీ రివ్యూ: రయీస్

ఖాన్ త్రయంలో సల్మాన్, ఆమీర్ లు వరుస రికార్డు విజయాలతో దూసుకుపోతుంటే.. సరైన విజయాలు లేకుండా ఇటీవల షారుక్ కాస్త వెనుబడిపోయాడు. దిల్ వాలే, ఫ్యాన్ చిత్రాలు షారుక్ కు ఆశించినంత సక్సెస్ అందించలేకపోయాయి.

ఈ నేపథ్యంలో గుజరాత్ లో మద్యం దందా ప్రధానాశంగా రయీస్ తెరకెక్కింది. మద్యం మాఫియా సామ్రాజ్యాధినేతకు, నిజాయితీకి మారుపేరైన పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగిన ఘర్షణ, వారిద్దరి మధ్య చోటుచేసుకొన్న ఎత్తులు పైఎత్తులను తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ సాగింది ఇలా..

మద్యపాన నిషేధం కొనసాగే గుజరాత్ లోని ఫతేపూర్ లో రయీస్ (షారుక్ ఖాన్) ఓ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. మద్యం సరఫరా చేసే స్థాయి నుంచి మద్యం వ్యాపారి యజమానిగా, ఎమ్మెల్యే స్థాయికి ఎదుగుతాడు. ఈ ప్రక్రియలో ఎన్నో ఆటుపోట్లు, జయాపజయాలు ఎదుర్కొంటాడు. తాను ప్రేమించిన మోసీనా (మహిరా ఖాన్)ను పెళ్లి చేసుకొంటాడు.

ఎదురులేకుండా కొనసాగుతున్న రయీస్ దందాలోకి నిజాయితీ ఆఫీసర్ అంబాలాల్ మజుందార్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) సవాల్ గా నిలుస్తాడు. గుజరాత్ లో మద్యం దందాకు చెక్ పెట్టడానికి ఏసీపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. మజుందార్ చేసే ప్రయత్నాలకు చిక్కకుండా రయీస్ తన మద్యం సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు.

ఈ నేపథ్యంలో రయీస్ వ్యాపారానికి మజుందార్ చెక్ పెట్టగలిగడా? రయీస్ మద్యం వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది? ఏసీపీని రయీస్ ఎదుర్కోవడంలో సఫలమయ్యాడా లాంటి ప్రశ్నలకు తెరమీద సమాధానాలు దొరుకుతాయి.

షారుక్ ఖాన్ ఫెర్ఫార్మెన్స్..

మద్యం సరఫరా చేసే వ్యక్తిగా, ఆ వ్యాపారాన్ని భారీగా విస్తరించిన యజమానిగా రయీస్ పాత్రలో షారుక్ చక్కగా ఒదిగిపోయాడు. అతని చూపులు, హావభావాలు అభిమానులను ఆకట్టుకుంటాయి. భావోద్వేగ, విషాద సన్నివేశాలలో షారుక్ చెప్పిన డైలాగ్స్ కు మల్టీప్లెక్స్ లో కూడా చప్పట్లు మోగాయి. ఫ్యాన్, దిలేవాలే చిత్రాలతో ఆకట్టుకోలేకపోయిన షారుక్ ఈ చిత్రం ద్వారా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాడు. స్ఠార్ గానే కాకుండా పూర్తిస్థాయి నటుడిగా మారోసారి రుజువుచేసుకోవడానికి లభించిన రయీస్ చిత్రాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నాడని చెప్పవచ్చు. తనదైన శైలిలో ఫైట్స్ చేసి, పాటల్లో కనిపించి అభిమానులను ఆలరించడంలో సక్సెస్ అయ్యాడు.

పోటాపోటీగా నవాజుద్దీన్ ఏసీపీ మజుందార్ గా నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి నట విశ్వరూపం ప్రదర్శించాడు. షారుక్ పోటాపోటీగా నటించాడు. ప్రతీ సన్నివేశంలోనూ తన మార్కును చూపించాడు. చిత్ర ద్వితీయార్థంలో నవాజుద్దీన్ తన నటనతో షారుక్ పై పైచేయి సాధించాడని చెప్పవచ్చు.

ఫర్వాలేదనిపించిన మహిరా

మోసీనా గా మహిరాఖాన్ తన పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. భావోద్వేగ సన్నివేశాల్లో కొంచెం తడబాటు కనిపించింది. కథ పరిధి మేరకు పాత్రపరంగా గ్లామర్ తక్కువగా ఉండటంతో మహిరా అభిమానులకు అందచందాలను ప్రదర్శించలేకపోయింది.

తళుక్కుమన్న సన్నిలియోన్

కథ సీరియస్ గా సాగిపోతున్న తరుణంలో ‘లైలా ఓ లైలా’ అంటూ సెక్స్ బాండ్ సన్నిలియోన్ తెరపై సందడి చేసింది. ఖుర్బానీ చిత్రంలోని లైలా ఓ లైలా పాటకు నర్తించి ప్రేక్షకుల్లో జోష్ పెంచింది. ప్రతినాయకులు అతుల్ కులకర్ణి, జీషన్ అయ్యుబ్ పాత్రల పరిధి అంతంతమాత్రమే. షారుక్ తల్లిగా షీబా చద్దా ఒకే అనిపించింది.

రాహుల్ ధోలాకియా భేష్

దర్శకుడిగా రాహుల్ ధొలాకియా కథను తెరకెక్కించడంలో నూటికి నూరుపాళ్లు సఫలమయ్యాడు. 80 దశకం నాటి వాతావరణాన్ని ప్రతిబించేలా చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ప్రశంసనీయం. మద్యం దందా సరిపోయే సెట్టింగులు సహజంగా ఉన్నాయి. పాత్రల దుస్తులు, ఆ కాలంలో ధరించే బెల్ బాటమ్ ప్యాంట్లు ప్రత్యేక ఆకర్షణ. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో దర్శకుడిగా రాహుల్ తన సత్తాను చూపించాడు. రామ్ సంపత్ అందించిన సంగీతం బాగుంది. పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కేయూ మోహనన్ కెమెరా పనితీరు ఎక్సెలెంట్.

ప్లస్ పాయింట్స్
షారుక్ నటన
రాహుల్ ధోలాకియా దర్శకత్వం
కెమెరా, ఆర్ట్ విభాగాలు
మైనస్ పాయింట్స్
పాటలు
సెకండాఫ్ లో కొంత భాగం
నటీనటులు
షారుక్ ఖాన్, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, మహిరాఖాన్, అతుల్ కులకర్ణి, జీషన్ అయ్యుూబ్, షీబా చద్దా
దర్శకత్వం: రాహుల్ ధొలాకియా
నిర్మాతలు: ఫర్హాన్ అఖ్తర్, గౌరీఖాన్, రితేష్ సిద్వాని
కెమెరా: కేయూ మోహనన్
సంగీతం: రామ్ సంపత్
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *