బడ్జెట్ నిరాశ పరిచింది: కవిత

కేంద్ర ఆర్ధిక బడ్జెట్ పై అధికార, మిత్రపక్ష, ప్రతిపక్ష నేతలు తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయం ప్రకారం అధికార పార్టీ నేతలు అది చారిత్రాత్మకమైన బడ్జెట్ అని మెచ్చుకొంటుంటే, అది తమని చాలా నిరాశపరిచిందని ప్రతిపక్ష నేతలు చెప్పుకొంటున్నారు. టీ-కాంగ్రెస్ నేతలు ఇప్పటికే దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి ఆప్తమిత్రుడు, రాష్ట్ర భాజపాకు శత్రువు అయిన తెరాస చాలా ఆచి తూచి స్పందించింది. నిజామాబాద్ ఎంపి కవిత బడ్జెట్ గురించి ఏమన్నారంటే, “తెలంగాణాకు ఎయిమ్స్ ఆసుపత్రి మంజూరు చేయకపోవడం చాలా నిరాశపరిచింది. బడ్జెట్ లో తెలంగాణాకు ప్రత్యేకంగా ఏమీ ప్రకటించలేదు. కానీ మొత్తంగా చూసిన్నట్లయితే, బడ్జెట్ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. చిన్న పరిశ్రమలకు, మద్యతరగతి ప్రజలకు కొంత ఊరటనిచ్చారు. బడ్జెట్ ని పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత మళ్ళీ దానిపై స్పందిస్తాము,” అని అన్నారు.

రాష్ట్ర విభజన సందర్భంగానే తెలంగాణాలో ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ రెండున్నరేళ్ళలో ఆంధ్రా, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు ఎయిమ్స్ మంజూరు చేసింది కానీ ఇంతవరకు తెలంగాణాకు మంజూరు చేయలేదు. అసలు ఎందుకు మంజూరు చేయడం లేదు? చేసే ఉద్దేశ్యం ఉందా లేదా? అనే సంగతి కూడా చెప్పడం లేదు. బహుశః హైదరాబాద్ నగరంలో అనేక ప్రతిష్టాత్మకమైన విద్యా, వైద్య సంస్థలున్నాయి కనుక ఎయిమ్స్ ఇవ్వనవసరం లేదని కేంద్రప్రభుత్వం భావిస్తోందేమో? కనుక ఎయిమ్స్ కోసం రాష్ట్ర ఎంపిలు, రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోక తప్పదనిపిస్తోంది. కానీ పోరాడితే కానీ ఏది ఇవ్వకపోవడం లేదా ప్రతీదాని కోసం పోరాడవలసి రావడం విచారకరమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *