మీరు సైకిల్ ను ఏమీ అనకండి .. చంద్రబాబు ఫీల్ అవుతారు

తెలంగాణలో ప్రతిపక్షం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే అధికార టీఆర్ ఎస్ పార్టీకి ఎంత చులకన అయిందో తెలియజెప్పే ఉదాహరణ ఇది. కాలుష్య నియంత్రణలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఏర్పాటు చేసిన అద్దె సైకిల్ల కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా మంత్రి కేటీఆర్ పెద్ద జోకు పేల్చారు. కార్యక్రమానికి హాజరయిన మంత్రి కేటీఆర్ కాసేపు సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కుతుండగా ఫోటోలు తీసేందుకు ఫోటో గ్రాఫర్లు అడ్డువచ్చారు. దీంతో నేను ఎలా వెళ్లాలి అని కేటీఆర్ అడగడంతో బెల్లు కొట్టమని మీడియా ప్రతినిధులు చెప్పారు. “మీరు సైకిల్ ను ఏమీ అనకండి .. చంద్రబాబు ఫీల్ అవుతారు” అనడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు.

ఇదిలాఉండగా కాలుష్య రహిత నగరాల్లో హైదరాబాద్ ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఢిల్లీలో ఇటీవల దట్టంగా పొగ కమ్ముకొని శ్వాసతీసుకునే పరిస్థితి కూడా లేకుండా పోవడంతో పాటు అనేకమంది ఆసుపత్రిపాలవడం స్కూళ్లకు సెలవులు కూడా ఇవ్వాల్సి వచ్చిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరంలో ఢిల్లీ తరహా ఇబ్బందులు తలెత్తకముందే ప్రభుత్వం బహుముఖ వ్యుహాలు సిద్ధం చేసిందని మంత్రి కేటీఆర్ వివరించారు. జపాన్ రాజధాని టోక్యోను రోల్ మోడల్ తీసుకుంటూ కాలుష్యానికి ప్రధాన కారణాలైన పారిశ్రామిక – రవాణా తదితర రంగాలను గాడిలో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోందని ప్రకటించారు.

మెట్రోరైలు – బీఆర్ టీఎస్ – ట్రామ్ వే – సైక్లింగ్ – వాకింగ్ ట్రాక్ లు – ఫుట్ పాత్ లు – హైబ్రీడ్ వెహికిల్స్కు ప్రోత్సాహం అందిస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. పరిశ్రమలను ఔటర్ వెలుపలికి తరలించడం. ఎస్ ఆర్ డీపీ ద్వారా రవాణాను సులభతరం చేయడం మాస్టర్ ప్లాన్ లో నిర్మాణ రంగాన్ని క్రమపద్ధతిలో అభివృద్ధిచేస్తూ ఖాళీ జాగాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై పెద్ద ఎత్తున కృషిచేస్తున్నట్లు తెలిపారు. నగరంపై మరింత భారం పడకుండా శివార్లలో శాటిలైట్ టౌన్ షిప్ లను అభివృద్ధిచేయడం – హుస్సేన్ సాగర్ లో రసాయన వ్యర్థాలు కలవకుండా ప్రత్యేకంగా పైప్ లైన్ ల ఏర్పాటు సాధ్యమైనన్ని ఎక్కువ ట్రీట్మెంట్ ప్లాంట్లు తమ ప్రణాళికలని వెల్లడించారు. మూసీలో సైతం శుద్ధిచేసిన నీటిని వదిలేందుకు చర్యలు – చెరువులను అభివృద్ధిచేస్తూ వాటిచుట్టూ పచ్చదనం పెంపొందించడం. ఖాళీ స్థలాల్లో పచ్చదనంతో ఉండేలా చర్యలు హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున గ్రీనరీ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *