ముకేష్ అంబానీ వార్షిక వేతనం అదే రూ.15 కోట్లు

బిలయనీర్ ముకేశ్‌ అంబానీ వరుసగా పదకొండో ఏడాది తన వార్షిక  వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ హోదాలో 2008-09 నుంచి అంటే వరుసగా 11 సంవత్సరాల నుండి  ముకేశ్‌ ఇంతే జీతం తీసుకుంటున్నారు. కంపెనీలో శాశ్వత డైరెక్టర్లందరి జీతాలు పెరుగుతున్నా ముకేశ్‌ అంబానీ  మాత్రం తన వేతనాన్ని పెంచుకునేందుకు ఇష్టపడట్లేదు. అంటే సంవత్సరానికి  దాదాపు రూ. 24 కోట్లను వదులకుంటున్నారు.

2018-19 లో ముకేశ్‌ రూ. 4.45 కోట్లు జీతంగా అందుకున్నారు. ఇక కమిషన్ కింద రూ. 9.53 కోట్లు, ఇతర భత్యాలు రూ. 31 లక్షలు, పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ. 71 లక్షలు తీసుకున్నారు.  ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ కోరిక మేరకు ఈ ఏడాది కూడా ఆయన వేతనాన్ని రూ. 15 కోట్లుగా నిర్ణయించాం. యాజమాన్య వేతన స్థాయిలు తక్కువగా ఉండాలని చెప్పడానికి ముకేశ్‌ వ్యక్తిగత ఉదాహరణగా నిలిచారు’ అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

అంబానీ బంధువులైన నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వానీల ఒక్కొక్కరి వేతనం రూ .20.57 కోట్లకు పెరిగింది.  ఇది  2017-18లో  రూ .19.99 కోట్లు,  2016-17లో రూ .16.58 కోట్లు గా ఉంది. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్ అతని వేతనం కూడా రూ .8.99 కోట్ల నుంచి రూ .10.01 కోట్లకు పెరిగింది.

నీతా అంబానీతో సహా ఆర్‌ఐఎల్‌కు చెందిన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సిట్టింగ్ ఫీజుతో పాటు ఒక్కొక్కరికి 1.65 కోట్ల రూపాయలు కమిషన్‌గా లభించాయి.  అంతక్రితం ఏడాది ఈ కమిషన్‌ రూ. 1.5 కోట్లుగా ఉంది. సిట్టింగ్‌ ఫీజు కింద నీతా అంబానీ రూ. 7 లక్షలు అందుకున్నారు. గతేడాది రిలయన్స్‌ బోర్డులో చేరిన ఎస్‌బీఐ మాజీ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాఛార్య రూ. 75 లక్షల కమిషన్‌ తీసుకున్నారు. ముకేష్ అంబానీ 2009 అక్టోబర్‌ నుండి  స్వచ్ఛందంగా తన వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్న సంగతి తెలిసిందే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *