ముంబై మరో చరిత్ర -మూడోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం

చరిత్ర మారింది! 2011 నుంచి టేబుల్ టాపర్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలువదన్న సెంటిమెంట్‌ను ఉప్పల్ సాక్షిగా ముంబై ఇండియన్స్ చెరిపివేసింది. ఐపీఎల్ పదో సీజన్‌లో చెలరేగి ఆడిన ముంబై జట్టు ఫైనల్లోనూ స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ప్రదర్శించింది. లీగ్‌దశలోనూ.. ప్లేఆఫ్స్‌లోనూ ఓడించిన పుణె సూపర్ జెయింట్‌ను ఫైనల్లో ఓడించి మూడోసారి ఐపీఎల్ చాంపియన్‌గా సగర్వంగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (47) ఒంటరి పోరాటం చేశాడు. 130 పరుగుల లక్ష్యాన్ని చేరి చాంపియన్‌గా నిలువాలని పుణె జట్టు ఆఖరి బంతివరకు పోరాడింది. సారథి స్మిత్ (51) విశ్వప్రయత్నం చేసినా విజయాన్ని అందించలేకపోయాడు. ముంబై కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్ ఊహించని మలుపులు తిరిగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పుణె జట్టు విజయానికి కేవలం పరుగుదూరంలో నిలిచి పరాజయంపాలైంది. దీంతో ఐపీఎల్‌లో చివరిసారిగా ఆడుతున్న పుణె జట్టు విజేతగా నిలువాలన్న కల చెదిరింది.

ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటూ పుణెపై తిరుగులేని ప్రతీకారాన్ని తీర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం రాజీవ్‌గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముంబై 1 పరుగు తేడాతో పుణెను ఓడించింది. టాస్ గెలిచిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (38 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత పుణె 20 ఓవర్లలో 6 వికెట్లకు 128 పరుగులు చేసింది. స్మిత్ (50 బంతుల్లో 51; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రహానే (38 బంతుల్లో 44; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడినా ఆఖరి ఓవర్‌లో నాటకీయ పరిణామాల మధ్య ఓటమిని మూటగట్టుకుంది.

సూపర్ బౌలింగ్..

పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పుణె బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ముంబై ఓపెనర్లు పార్థివ్ (4), సిమ్మన్స్ (3) పరుగులు చేయడంలో తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రెండో ఓవర్‌లో కుర్ర స్పిన్నర్ సుందర్ చేతికి బంతి ఇవ్వడంతో స్మిత్ కొత్త వ్యూహాన్ని అమలు చేశాడు. మూడో ఓవర్‌లో ఉనాద్కత్… నాలుగు బంతుల తేడాలో ఓపెనర్లిద్దర్నీ ఔట్ చేస్తూ ప్రత్యర్థులకు డబుల్ షాకిచ్చాడు. తెలుగుతేజం అంబటి రాయుడు (12)తో కలిసి ఇన్నింగ్స్‌ను బాగు చేసే బాధ్యత తీసుకున్న సారథి రోహిత్ (24).. పెర్గుసన్ వేసిన ఆరో ఓవర్‌లో నాలుగు ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 32/2 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌ను సడలించిన తర్వాత రెండో ఎండ్ నుంచి స్పిన్నర్ జంపాను రంగంలోకి తెచ్చిన పుణె.. రోహిత్, రాయుడుపై ఒత్తిడి పెంచింది. సింగిల్ తీసే ప్రయత్నంలో ఏడో ఓవర్‌లో రాయుడు అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.

ఫలితంగా మూడో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఓవరాల్‌గా తొలి 10 ఓవర్లలో ముంబై 3 వికెట్లకు 56 పరుగులు మాత్రమే చేసింది. ఇక 11వ ఓవర్‌లో జంపా ముంబైని మరోసారి ముంచాడు. అతను వేసిన తొలి బంతికి రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్‌వికెట్‌లో బౌండరీ వద్ద ఠాకూర్ కండ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. ఎదుర్కొన్న మొదటి బంతినే స్టాండ్స్‌లోకి పంపిన పొలార్డ్ (7)ను ఆఖరి బంతికి ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో ముంబై 65 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కృనాల్ పాండ్యా స్థిరంగా ఆడినా రెండో ఎండ్‌లో హార్దిక్ (10), కర్ణ్‌శర్మ (1) నిరాశపర్చారు. చివర్లో జాన్సన్ (13 నాటౌట్) నిలకడగా ఆడిన ఎనిమిదో వికెట్‌కు 35 బంతుల్లో 50 పరుగులు జోడించడంతో ముంబైకి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

లక్ష్యం చిన్నదికావడంతో పుణె మెల్లగా ఆడే ప్రయత్నం చేసినా మూడో ఓవర్‌లోనే రాహుల్ త్రిపాఠి (3) వికెట్‌ను కోల్పోయింది. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో కృనాల్ జారవిడచడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వన్‌డౌన్‌లో స్మిత్ (51) సమయోచితంగా స్పందించడంతో ఆ తర్వాత రహానే ఒత్తిడి లేకుండా ఆడాడు. రోహిత్ వరుసగా బౌలర్లను మార్చడం, భారీ షాట్లు లేకపోవడంతో పవర్‌ప్లేలో పుణె వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. ఓవరాల్‌గా రెండు జట్లు కలిపి పవర్‌ప్లేలో చేసిన స్కోరు (70 పరుగులు) ఐపీఎల్‌లోనే మూడో అత్యల్పం. ఏడో ఓవర్ నుంచి ముంబై బౌలింగ్ మరింత పదునెక్కింది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు ఎండ్‌ల నుంచి కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పుణె జోడీ ఒత్తిడిలో పడింది. ఫలితంగా స్మిత్, రహానే వికెట్‌ను కాపాడుకునేందుకు ప్రాధాన్యమివ్వడంతో రన్‌రేట్ మందగించింది. నాలుగు ఓవర్లలో 20 పరుగులే రావడంతో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి పుణె స్కోరు 58/1కి చేరింది. చేయాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో రహానే కాస్త బ్యాట్ ఝుళిపించేందుకు యత్నించాడు. కానీ 12వ ఓవర్‌లో జాన్సన్ వేసిన స్లో బంతిని డ్రైవ్ చేయగా లాంగాన్‌లో పొలార్డ్ 15 అడుగులు ముందుకొచ్చి అద్భుతంగా అందుకున్నాడు.

ఫలితంగా రెండో వికెట్‌కు 9.3 ఓవర్లలో 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ప్రేక్షకులు కేరింతల నడుమ క్రీజ్‌లోకి వచ్చిన జార్ఖండ్ డైనమెట్ ధోనీ (10) కూడా ఒకటి, రెండు పరుగులకే పరిమితం కావడంతో మ్యాచ్‌లో కాస్త ఉత్కంఠ నెలకొంది. స్మిత్, మహీ 10 నుంచి 15 ఓవర్ల మధ్య 25 పరుగులే చేయడంతో 15 ఓవర్లలో పుణె 2 వికెట్లకు 83 పరుగులకు చేరింది. కృనాల్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి మహీ ఫోర్ బాదితే.. ఐదో బంతిని స్మిత్ రివర్స్ స్వీప్‌తో సిక్సర్‌గా మలిచాడు. ఇన్నింగ్స్‌లో ఇదే తొలి సిక్సర్. ఈ ఓవర్‌లో 14 పరుగులు రావడంతో పుణె కాస్త కోలుకున్నా… తర్వాతి ఓవర్‌లో ధోనీ వికెట్ తీసి బుమ్రా షాకిచ్చాడు. స్మిత్‌తో కలిసి మహీ మూడో వికెట్‌కు 27 పరుగులు జత చేశాడు. ఇక గెలువాలంటే 18 బంతు ల్లో 30 పరుగులు చేయాల్సి దశలో రెండు ఓవర్లలో 19 పరుగులే రావడంతో ఉత్కంఠ నెలకొంది. 6 బంతుల్లో 11 పరుగులు అవసరమైన దశలో జాన్సన్ వేసిన తొలి బంతిని బౌండరీ దాటించిన మనోజ్ తివారీ (7) రెండో బంతికి వెనుదిరిగాడు. మూడో బంతికి స్మిత్ అనూహ్యంగా క్యాచ్ ఔట్‌కావడంతో విజయసమీకరణం 3 బంతుల్లో 7గా మారింది. ఈ దశలో 3 పరుగులు వచ్చినా ఆఖరి బంతికి మూడో పరుగు తీసే ప్రయత్నంలో క్రిస్టియాన్ (4) రనౌట్‌కావడంతో ఒక్క పరుగు తేడాతో పుణె చతికిలపడింది.

ముంబై ఇండియన్స్:

సిమ్మన్స్ (సి అండ్ బి) ఉనాద్కత్ 3, పార్థివ్ (సి) ఠాకూర్ (బి) ఉనాద్కత్ 4, రాయుడు రనౌట్ 12, రోహిత్ (సి) ఠాకూర్ (బి) జంపా 24, కృనాల్ (సి) రహానే (బి) క్రిస్టియాన్ 47, పొలార్డ్ (సి) తివారీ (బి) జంపా 7, హార్దిక్ ఎల్బీ (బి) క్రిస్టియాన్ 10, కర్ణ్‌శర్మ రనౌట్ 1, జాన్సన్ నాటౌట్ 13, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 129/8.
వికెట్లపతనం: 1-7, 2-8, 3-41, 4-56, 5-65, 6-78, 7-79, 8-129.
బౌలింగ్: ఉనాద్కత్ 4-0-19-2, సుందర్ 4-0-13-0, ఠాకూర్ 2-0-7-0, ఫెర్గుసన్ 2-0-21-0, జంపా 4-0-32-2, క్రిస్టియాన్ 4-0-34-2.

రైజింగ్ పుణె సూపర్‌జెయింట్:

రహానే (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 44, త్రిపాఠి ఎల్బీ (బి) బుమ్రా 3, స్మిత్ (సి) రాయుడు (బి) జాన్సన్ 51, ధోనీ (సి) పార్థివ్ (బి) బుమ్రా 10,తివారీ (సి) పొలార్డ్ (బి) జాన్సన్ 7, క్రిస్టియాన్ రనౌట్ 4, సుందర్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 128/6.
వికెట్లపతనం: 1-17, 2-71, 3-98, 4-123, 5-123, 6-128.
బౌలింగ్: కృనాల్ 4-0-31-0, జాన్సన్ 4-0-26-3, బుమ్రా 4-0-26-2, మలింగ 4-0-21-0, కర్ణ్‌శర్మ 4-0-18-0

అవార్డులు.. రివార్డులు

విజేత ( ముంబై ): రూ.15 కోట్లు
రన్నరప్( పుణె ): రూ.10 కోట్లు
ఫెయిర్‌ప్లే అవార్డు: గుజరాత్ లయన్స్
ఉత్తమ వర్ధమాన ఆటగాడు: బాసిల్ తంపీ(గుజరాత్)
అత్యంత విలువైన ఆటగాడు: బెన్ స్టోక్స్(పుణె)

ఆరెంజ్ క్యాప్

డేవిడ్ వార్నర్(సన్‌రైజర్స్) 641 పరుగుల
పర్పుల్ క్యాప్

భువనేశ్వర్(సన్‌రైజర్స్) 26 వికెట్లు

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *