‘స్పైడ‌ర్‌’ రీషూట్ల‌పై మురుగ‌దాస్ కామెంట్స్‌

మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ‘స్పైడ‌ర్‌’. సెప్టెంబ‌రు 27న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ వేస‌వికి ‘స్పైడ‌ర్‌’ని విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. కానీ.. మురుగ‌దాస్ వ‌ల్లే ఈ సినిమా ఆల‌స్య‌మైంద‌ని, రీషూట్ల‌తో విసిగెత్తించాడ‌ని, రీషూట్ల కోస‌మే సినిమాని వాయిదా వేసుకొంటూ వెళ్లార‌ని ప్ర‌చారం జోరుగా సాగింది. దీనిపై మురుగ‌దాస్ స్పందించాడు. ”స్క్రిప్టు ద‌శ‌లో ఉన్న‌ది ఉన్నట్టుగా తెర‌పై రాదు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో్ మార్పులు చేయాల్సిందే. బెట‌ర్‌మెంట్ కోసం అవి త‌ప్ప‌దు. సెట్లో ఏవో ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి.

ఒక్కోసారి ఎడిడింగ్ టేబుల్ ద‌గ్గ‌ర ‘షాట్ ఉంటే బాగుంటుంది క‌దా’ అనుకొంటుంటాం. దాన్ని రీషూట్ అనుకొంటే ఎలా..? తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి సినిమా తెరకెక్కించ‌డం నాకు కొత్త‌. తెలుగులో ఓసారి, త‌మిళంలో ఓసారి షూటింగ్ చేసేవాళ్లం. దాంతో సినిమా ఆల‌స్య‌మైంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ఈ సినిమాలో ప్రాధాన్యం ఉంది. క్వాలిటీ మేకింగ్ కావాలంటే సినిమా కాస్త ఆల‌స్య‌మైనా ఫ‌ర్వాలేదు. మ‌హేష్ కూడా ‘మీరు ఎన్నాళ్లు టైమ్ తీసుకొన్నా ఫ‌ర్వాలేదు. మీరు `ఇక చాలు` అన్న త‌ర‌వాతే.. మ‌రో సినిమా ఒప్పుకొంటా’ అన్నాడు. ఆయ‌న డెడికేష‌న్ అలాంటిది. మేం తెర వెనుక ఏం చేసినా.. తెర ముందు సినిమా బాగా రావాల‌నే. `స్పైడ‌ర్‌` ఆల‌స్యం అవ్వ‌డానికి కార‌ణం ఇదే” అన్నారు మురుగ‌దాస్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *